ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

Feb 18,2024 00:00

ప్రజాశక్తి – బాపట్ల
ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎపీ జెఎసి ఆధ్వర్యంలో తహశీల్దారు కార్యాలయం వద్ద శనివారం ధర్నా చేశారు. ఎన్‌జిఒ అధ్యక్షులు పి నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో 15లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, ఫుల్ టైం, దినసరి కార్మికులు వివిధ శాఖల్లో పనిచేస్తున్నారని అన్నారు. ప్రతి ఉద్యోగికి ఆర్థిక, ఆర్థికేతర సమస్యలు ఉన్నాయని అన్నారు. 12వ పిఆర్సి కమిషన్ వేసినప్పటికీ ప్రగతికి నోచుకోలేదని అన్నారు. రాష్ట్రస్థాయి ఉద్యోగ సంఘాలతో చర్చించి ఉద్యోగుల నుండి సమాచారాన్ని సేకరించి అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదికను సమర్పించేందుకు గడువు కావాలని అన్నారు. 2023 జూలై 1నుండి పిఆర్సి అమలు కావలసి ఉందని అన్నారు. ధరలు పెరిగి ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉద్యోగులకు తక్షణమే రూ.25వేల కోట్లు బకాయిలు చెల్లించాలని కోరారు. సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దారు కార్యాలయ డిటి శ్రీదేవికి అందజేశారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు వినయ్ కుమార్, ఎపిటిఎఫ్‌ కార్యదర్శి జి ఇసాక్, చాంద్ భాషా, యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు బడుగు శ్రీనివాసరావు, ఎస్‌టియు జిల్లా అధ్యక్షులు అమర్నాథ్, ఎస్‌టియు అధ్యక్షులు సిహెచ్ సుబ్బారావు, పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రామ్మోహనరావు, ఎన్ఎంయు జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు.


పర్చూరు : ఉద్యోగుల పిఆర్‌సి, సిపిఎస్‌ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు శనివారం నిరసన వ్యక్తం చేశారు. ధర్నా అనంతరం డిప్యూటీ తహశీల్దారు ఎల్ నాగలక్ష్మికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎన్‌జిఒ అసోసియేషన్‌ తాలూక అధ్యక్షులు ఎం సత్యనారాయణ, యుటిఎఫ్‌ కార్యదర్శి సుబ్బయ్య, ఆర్‌ఐ ప్రేమ్ కుమార్, కె కుమారి, డిజిటల్ అసిస్టెంట్ ఎంఎం రఫీ, ఎఎస్‌ఒ శ్రీమన్నారాయణ, సర్వేయర్ సురేష్, యు సుబ్బారావు, ప్రకాష్, ఆర్‌డబ్ల్యుఎఫ్‌ సిబ్బంది, విఆర్‌ఒలు, సర్వేయర్లు, సచివాలయం ఉద్యోగులు పాల్గొన్నారు.

➡️