పండగ పూట కూడా స్వీపర్లకు అవస్థలు

Jan 13,2024 00:32

ప్రజాశక్తి – భట్టిప్రోలు
పంచాయతీలో పారిశుధ్య కార్మికులకు వేతనాలు కరువయ్యాయి. చెత్తా చెదారంతోపాటు మురుగు కాలువలో పనిచేసే వీరికి నిబంధనల ప్రకారం ప్రతి నెల వేతనంతో పాటు సబ్బులు, సరుకులు, కొబ్బరినూనె వంటి వస్తువులు అందించాల్సి ఉంది. కానీ భట్టిప్రోలు మేజర్ పంచాయతీలో పనిచేసే 30మంది కార్మికులకు గత మూడేళ్లుగా ఒక్క అలవెన్స్ కూడా ఇవ్వడంలేదు. కార్మికులకు మూడేళ్ల క్రితం అందజేసిన యూనిఫామ్ చిరిగిపోయింది. యూనిఫాంతో పాటు ఆనాడు అందించిన కొబ్బరినూనె, సబ్బులు, సరుకులు, ఇతర వస్తువులు మినహా ఇప్పటివరకు ఏదీ అందించిన దాఖలాలు లేకపోవడంతో కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ అధికారులు, పాలకవర్గాన్ని అడుగుగతున్నప్పటికీ స్పందించటం లేదు. మురుగు కాలువల్లో పనిచేసి సాయంత్రానికి ఇంటికి వెళ్లి భోజనం చేయాలంటే చేతులు దుర్వాసనతో అసహ్యంగా ఉంటుందని, ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉంటున్నామని వాపోతున్నారు. కార్మికుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. రూ.కోటికిపైగా ఆదాయం ఉన్న పంచాయతీలో కార్మికుల పట్ల నిర్లక్ష్యం వహించటం ఎంతవరకు సమంజసమని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా మాటలు చెబుతున్నారే తప్ప ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి పండుగకైనా అలవెన్సులు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శి కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ కార్మికులకు కచ్చితంగా అందించాల్సి ఉందని అన్నారు. పండుగ నాటికి అందించేందుకు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

➡️