ఆనందబాబుకు భారీ మెజారిటీ

ప్రజాశక్తి – వేమూరు
టిడిపి అభ్యర్థి, మాజీ మంత్రి నక్క ఆనందబాబు 21,506 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. నాయకుల అంచనాలకు అందని విధంగా మెజారిటీ రావడం టిడిపి శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. చుండూరు మండలం నుండి లెక్కింపు ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుండి టిడిపికి మెజారిటీ వస్తూ నాలుగు రౌండ్లు పూర్తికాగానే వైసిపికి 28ఓట్లు మెజార్టీ లభించింది. దీంతో కొంతమేర వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపించింది. 5వ రౌండ్ ప్రారంభం కాగానే ఈ మెజారిటీ కాస్త అధిగమించి టిడిపి పుంజుకుంది. క్రమంగా 21,506కు చేరుకోవడం టిడిపి శ్రేణుల్లో ఆనందాన్ని కలిగించింది. నోటతో కలిపి 16 మంది అభ్యర్థులు బరిలో నిలబడగా చివరి రౌండు పూర్తయ్యేసరికి వైసీపీ అభ్యర్థి వరికూటి అశోక్ బాబుకు 69,347 ఓట్లు రాగా, టిడిపి అభ్యర్ధి నక్క ఆనందబాబుకు 89582 ఓట్ల లభించాయి. కాంగ్రెస్ అభ్యర్థి బూరగా సుబ్బారావుకు 1579 ఓట్లు వచ్చాయి. నోటాకు 1682 ఓట్లు పడ్డాయి. భట్టిప్రోలులో 4వేలకుపైగా టిడిపికి మెజార్టీ రావడంపట్ల టిడిపి గ్రామ నాయకుల్లో మరింత ఉత్సాహం కనిపించింది. మండలంలోని ఐలవరంలో వైసీపీకి కొంత మెజార్టీ లభిస్తుందని ఆశించినప్పటికీ నిరాశ, భంగపాటు తప్పలేదు. ఈ గ్రామంలో 506 ఓట్లు టిడిపికి మెజార్టీ లభించింది. ఐదు మండలాలుండగా చుండూరు, అమర్తలూరు మండలాల్లో వైసీపీ, టీడీపీ మధ్య గట్టి పోటీ కొనసాగగా వేమూరు, కొల్లూరు, భట్టిప్రోలు పోలింగ్‌ బూతులు లెక్కింపు పూర్తయ్యేసరికి టిడిపికి పూర్తి మెజారిటీ కనిపించింది. ఈసందర్భంగా నక్క ఆనందబాబు మాట్లాడుతూ ప్రజలు తనపై నమ్మకంతో ఇంత మెజార్టీ అందించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుని అభివృద్ధికి తన వంతు కృషిచేస్తానని అన్నారు.

➡️