కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి మొండి చేయ్యి : సీపీఎం పట్టణ కార్యదర్శి సిహెచ్ మణిలాల్

Feb 2,2024 22:51

ప్రజాశక్తి – రేపల్లె
రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు లేవని, వైజాగ్ స్టీల్, పోర్టులకు కోత విదించారని, విభజన హామీల ఊసేలేదని, ధనవంతులను మరింత ధనికులను చేసి,పేదలను పీల్చిపిప్పి చేసే విధంగా కేంద్రబడ్జెట్ ఉందని సిపిఎం పట్టణ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ అన్నారు. స్థానిక సీపీఎం కార్యాలయంలో కేంధ్ర బడ్జెట్‌పై ఆయన మాట్లాడారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ ధనికులను మరింత ధనికులుగా చేసి, పేదలను పీల్చి పిప్పి చేసేదిగా ఉందని ఆరోపించారు. భారత ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్య పరిస్థితి గురించి కేంద్ర ఆర్థిక మంత్రి గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ దేశం ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థికసంక్షోభం బడ్జెట్లో అర్దం అవుతుందని అన్నారు. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు నిరాశే మిగిలిందని అన్నారు. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీల నేతలు సహా అధికార వైసిపి కేంద్రబడ్జెట్ ద్వార రాష్ట్రానికి రావలసిన నిధులు రాబట్టడంలో విఫలమైందని ఆరోపించారు. విభజన చట్టంలోని అంశాలకు, కేంద్ర విద్యా సంస్థలకు ఎటువంటి కేటాయింపులు లేవని అన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్, విశాఖ పోర్టుకు కేటాయింపులు తగ్గించారని పేర్కొన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు 2023-24 బడ్జెట్లో రూ.683 కోట్లు కేటాయిస్తే, ప్రస్తుతం రూ.620కోట్లకు కుదించారని తెలిపారు. విశాఖ పోర్టు ట్రస్టుకు 2023-24 బడ్జెట్లో రూ.276కోట్లు కేటాయిస్తే, ప్రస్తుతం రూ.150కోట్లకు తగ్గించారని అన్నారు. సెంట్రల్ యూనివర్సిటీకి గత బడ్జెట్లో రూ.112.08, గిరిజన యూనివర్సిటీకి రూ.40.67కోట్లు కేటాయించగా ఈసారి ఏమీ కేటాయించలేదని అన్నారు. కేంద్ర విద్యా సంస్థలు ఐఐటి, ఐఐఎం, ఎన్ఐఐటి, ఐఐఎస్ఐఆర్, ట్రిపుల్ ఐటి, ఎయిమ్స్ వంటి వాటికి కేటాయింపులు లేవని తెలిపారు. విశాఖ రైల్వేజోన్, కడప ఉక్కుపరిశ్రమ, దుగ్గిరాజపట్నం పోర్టు, రాజధాని నిర్మాణానికి నిధులు, పోలవరం ప్రాజెక్టుకు మొండి చెయ్యే మిగిలిందని అన్నారు. వైజాగ్, విజయవాడ మెట్రోలకు బడ్జెట్లో ఊసేలేదని తెలిపారు. వెనుకబడిన జిల్లాల నిధుల గురించి కనీసం ప్రస్తావనే లేదని అన్నారు. అభివృద్ధి నిరోధక కేంద్రబడ్జెట్‌ను వ్యతిరేకిస్తూ ఈనెల 7, 8 తేదీల్లో ఢిల్లీలో జరిగే ధర్నాల్లో కార్మికవర్గం,పేదలు పాల్గొనాలని కోరారు. సమావేశంలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు కె ఆశీర్వాదం, కెవి లక్ష్మణరావు పాల్గొన్నారు.

➡️