రోడ్డును పరిశీలించిన అధికారులు

Jan 13,2024 01:04

ప్రజాశక్తి – ఇంకొల్లు
ఆర్ అండ్ బి రహదారైన పావులూరు రోడ్డులో రోటరీ వాటర్ ప్లాంట్ ఎదురుగా నివాసం ఉంటున్న గృహస్థుల మురుగునీరు గత రెండేళ్లుగా రోడ్డుపైకి వదిలేస్తున్నారు. వాహనదారులకు, పాదచారులు, నిత్యం వాటర్ ప్లాంటుకు మంచినీరు కోసం వచ్చే ప్రజలకు తీవ్ర అసౌకర్యంగా మారింది. నిత్యం రోడ్డుపై మురుగు నీళ్లు నిల్వ ఉండటంతో వాహనాలు తిరిగి రోడ్డు గుంటలు పడుతుంది. గ్రామస్తులు సమస్యను పంచాయితీ దృష్టికి, ఆర్అండ్‌బి అధికారుల దృష్టికి తీసుకుపోయినప్పటికీ నేటికీ పరిష్కారం కాలేదు. గుంటలను తాత్కాలికంగా రెండు మూడు పర్యాయములు గ్రావెల్ వేసి సరిచేసినప్పటికీ మళ్లీ నీరు రోడ్డుపైనే ప్రవహిస్తూ ఉండటం వల్ల తాత్కాలికంగా గుంటల్లో వేసిన పూడిక లేచిపోయి మళ్ళీ గుంటలుగా మారాయి. మురుగు కాల్వ నిర్మిస్తే సమస్య తీరుతుందని పంచాయితీ అదికారులకు వివరించినప్పటికీ పట్టించుకోలేదు. మురుగు కాలువ నిర్మాణానికి ఖర్చు చాల అవుతుందని, నిధులు లేవని పంచాయతీ సర్పంచి, అధికారులు తెలిపారు. తాత్కా కలికంగా తూములు వేసినప్పటికీ ఫలితం లేదు. రోడ్డు పక్కన గుంటలు తీసినప్పటికీ మురుగునీటితో ఆ గుంటలు నిండి మళ్లీ రోడ్డుపైకే వస్తున్నాయి. సమస్య తీవ్రంగా ఉండటంతో పంచాయితీ రాజ్‌ డిఇ నరసింహారావు, పంచాయితీ సెక్రటరీ నాగయ్య రోడ్డును పరిశీలించారు. పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

➡️