డిసెంబర్‌లో వైజ్ఞానిక ప్రదర్శనలు

Nov 28,2023 23:51

ప్రజాశక్తి – బాపట్ల
జిల్లాలో డిసెంబరు 11, 12తేదీల్లో జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించాలని డిఇఒ పివిజె రామారావు విద్యాశాఖ అధికారులకు మంగళవారం సూచించారు. విద్యా, వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహణపై స్థానిక ఎస్ఎంజి హై స్కూల్లో హెచ్‌ఎంలు, ఎంఇఒల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాఠశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు డిసెంబర్ 11, 12తేదీల్లో ప్రభుత్వ పాఠశాలల, మండల స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను నిర్వహించాలని తెలిపారు. ఏడు అంశాలపై పోటీలుంటాయని అన్నారు. 25 మండలాల్లో ప్రథమస్థానం పొందిన ప్రాజెక్టులను ఎంపికచేసి జిల్లాస్థాయి ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. వీటిలో ప్రతిభ కనబరచిన ప్రాజెక్టులు రాష్ట్రస్థాయి విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనలో పోటీపడతాయని అన్నారు. కౌశల్ 2023 ప్రతిభా పోటీలు 13, 14తేదీల్లో పాఠశాల స్థాయిలో జరపాలని చెప్పారు. హెచ్‌ఎంలు, కౌశల్ కో ఆర్డినేటర్లు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. 3న జరిగే ఎన్ఎంఎంఎస్ పరీక్షలు పగడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని అన్నారు. ఆడుదాం ఆంధ్ర రిజిస్ట్రేషన్లు వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రతీ మండలంలో క్షేత్ర స్థాయిలో నమోదుపై శ్రద్ధ వహించాలని అన్నారు. సమావేశంలో చీరాల డీవైఈఒ ఆర్ శ్రీనివాసులు, డీఎస్ఒ మహమ్మద్ సాదిక్, ఎంఇఒలు, వివిధ పాఠశాలల హెచ్‌ఎంలు పాల్గొన్నారు.

➡️