ఘర్షణలకు పాల్పడితే కఠిన చర్యలు : ఎస్పీ వకూల్ జిందాల్

May 19,2024 22:22 ##Bapatla #Chirala #Police

– అల్లర్లకు పాల్పడితే కేసులు నమోదు చేసాం
– కేసుల తీవ్రతను బట్టి రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నాం
– ఎక్కువ కేసులున్న వారిని జిల్లా బహిష్కరణకు సిద్ధం
– అమలులో కౌంటింగ్ రోజు 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్
– జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ జరిగిందన్న ఎస్పీ
ప్రజాశక్తి – చీరాల
ఘర్షణలకు పాల్పడే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌పి వకుల్‌ జిందాల్‌ హెచ్చరించారు. ఇటీవల జరిగిన ఘర్షణ కేసుల్లో ముద్దాయిలను ఈపాటికే అరెస్టు చేశామని తెలిపారు. వారిపై నిఘా ఉంచామని అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రూరల్ ఈపూరుపాలెం పోలీస్ స్టేషన్, రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఎన్నికల సమయంలో, ఎన్నికల అనంతరం నమోదైన కేసులను క్షుణ్ణంగా ఆదివారం పరిశీలించారు. కేసుల ప్రస్తుత స్థితిని స్థానిక పోలీసు అధికారులను అడిగి తెలుసుకొన్నారు. తర్వాత తీసుకోవాల్సిన చర్యలను సూచించారు. ఓట్ల లెక్కింపు రోజు 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని అన్నారు. 2వ పట్టణ, రూరల్ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులను పరిశీలించడానికి వచ్చినట్లు తెలిపారు. ఈపాటికే కేసుల్లో ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కొందరికి 41(ఎ) సిఆర్‌పిసి కింద నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. ముద్దాయిలపై నిరంతరం నిఘా ఉంటుందని తెలిపారు. ముద్దాయిల చర్యలు పునరావృతం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వరుసగా నేరాల్లో పాల్గొంటున్న వారిపై రౌడీషీట్ తెరుస్తామని తెలిపారు. వారి ప్రవర్తన మార్చుకోకపోతే చట్ట పరంగా జిల్లా బహిష్కరణ చేయటానికి వెనకాడబోమని తెలిపారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా పట్టిష్ట బద్రత చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కౌంటింగ్ ముగిసిన తర్వాత ఎటువంటి ఊరేగింపులు, ర్యాలీలు చేయకూడదని చెప్పారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించటానికి ప్రయత్నించినా ఉపేక్షించబోమని అన్నారు. అల్లర్లలో పాల్గొనే వారి వాహనాలు సీజ్ చేస్తామని అన్నారు. ఎన్నికల సందర్భంగా నమోదైన ప్రతి కేసును సమీక్షిస్తామని తెలిపారు. కార్యక్రమంలో డిఎస్పి బి ప్రసాద్, స్పెషల్ బ్రాంచ్ సిఐ వి మల్లికార్జున, సిఐలు సోమశేఖర్, శేషగిరిరావు, నిమ్మగడ్డ సత్యనారాయణ పాల్గొన్నారు.

➡️