చేనేత కార్మికుల ఆత్మ హత్యలు నివారించాలి

May 23,2024 22:47 ##Battiprolu #Chenetha

ప్రజాశక్తి -భట్టిప్రోలు
చేనేత కార్మికుల ఆత్మ హత్యలను నివారించాలని, ఈపాటికే మృతి చెందిన కార్మికులకు రూ.50లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తహశీల్దారు కార్యాలయంలో చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో గురువారం వినతి పత్రం చేశారు. జనత కార్మిక సంఘం జిల్లా నాయకులు దీపాల సత్యనారాయణ, మురుగుడు సత్యనారాయణ మాట్లాడుతూ చేనేత పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం కారణంగా నేసిన వస్త్రానికి గిట్టుబాటు ధర లేక చేసిన అప్పు తీర్చే మార్గం లేక సోమవారం రాత్రి అనంతపురం జిల్లా పెద్దవడుగూరుకు చెందిన చేనేత కార్మికుడు కుళ్లాయప్ప (40) ఆత్మహత్య చేసుకోగా, సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో బుధవారం మరో చేనేత కార్మికుడు సేల బాల చౌడయ్య(29) ఆత్మహత్య చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నూలు, రంగులు, రసాయనాలు, చేనేత వస్త్రాలపై విధించిన జీఎస్టీ కారణంగా చేనేత వస్త్రాల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ఎక్కడి కక్కడ వస్త్ర నిల్వల పేరుకుపోయాయని అన్నారు. దీని కారణంగా కార్మికులకు పనులు దొరక్క వరుస ఆత్మహత్యలు జరుగుతున్నాయని అన్నారు. వీరు ఇరువురు నేసిన వస్త్రాల ధరలు పెరగటం వలన అమ్ముడు పోక, చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్నట్లు పేర్కొన్నారు. దీనికి తోడు చేనేతకు గతంలో ఉన్న యారన్‌ సబ్సిడీ, ట్రిప్ట్ పండ్, పావలా వడ్డీ, హెల్త్ స్కీం తదితర సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేయడంతో చేనేత కార్మికుల పరిస్థితి మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన కార్మికులకు ప్రభుత్వం తక్షణమే రూ.50లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం చేనేత పరిశ్రమపై వేసిన జీఎస్టీని వెంటనే ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. చేనేతకు కేటాయించిన 11 రకాల రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయాలని కోరారు. యారన్‌ సబ్సిడీ, వంటి అనేక చేనేత రక్షణ సంక్షేమ పథకాలను తిరిగి అమలు చేయాలని కోరారు. చేనేత సహకార సంఘాలకు రావాల్సిన రిబేటు, ఆప్కో బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరారు. బడ్జెట్లో చేనేతకు రూ.2వేల కోట్లు కేటాయించాలని, కార్మికులకు ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వాలని, నిత్యం పెరుగుతున్న నూలు ధరలను స్థిరీకరించాలని, ప్రతి కార్మికునికి రూ.2లక్షలు ముద్ర లోన్ ఇప్పించాలని, తదితర డిమాండ్లను వినతి పత్రంలో పేర్కొన్నారు. కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం నాయకులు బట్టు నాగమల్లేశ్వరరావు, ఆకురాతి శ్రీనివాసరావు ఎస్ఎఫ్ఐ నాయకులు పి మనోజ్ పాల్గొన్నారు.

➡️