రైతు కంట కన్నీరు

Dec 8,2023 22:49

– నిండా ముంచిన మిచౌంగ్ తుపాను
– పొలాల్లో పడిపోయిన కరెంట్ స్థంబాలు
– రైతులకు నష్టం పరిహారం ఇవ్వాలని సిపిఎం డిమాండ్
ప్రజాశక్తి – చీరాల
తుపాను రైతుకు కన్నీరు తెప్పిస్తోంది. వడ్డీలకు అప్పుతెచ్చి సాగు చేసిన పంట పూర్తిగా నీటి మయం కావడంతో దిక్కు తోచని స్థితిలో రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని బుర్లవారిపాలెం, పిట్టువారిపాలెం, తోటవారిపాలెం, సీఇసీ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంతం, గవిని వారిపాలెం, దండుబాట రోడ్డులోని చిట్టివాద ప్రాంతలలో రైతులు వేసిన పంటలు అన్నీ వర్షం దాటికి మునిగిపోయాయి. పిట్టువారిపాలెం బైపాస్ రోడ్డు సమీపంలో రైతులు వందల ఎకరాలలో మినుము సాగు చేశారు. తుఫాను దాటికి పంట మునిగిపోవడంతో పాటు పొలాల్లో ఉన్న విద్యుత్ స్తంభాలన్ని వరుసగా నేలకు ఒరిగాయి. బుర్లవారిపాలెంలో సాగు చేసిన మొక్కజొన్న ఈదురు గాలికి నేలవాలింది. వేరుశనగ పంట మొత్తం వర్షపు నీరు చేరడంతో ఉరకలెత్తి కుళ్ళిపోయి రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. వరి పైరు మునిగి పోయింది. అధికారులు తమ వద్దకు రావడం లేదని, నామమాత్రపు సర్వే చేసి చేతులు దులుపుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు తమను గుర్తించి నష్టపరిహారం అందించే విధంగా చర్యలు చేపట్టాలని రైతులు కోరారు.
రైతులను ఆదుకోవాలి : సిపిఎం కార్యదర్శి ఎన్ బాబురావు
తుఫాను ప్రభావం వలన నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని సిపిఎం కార్యదర్శి ఎన్ బాబురావు కోరారు. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి తక్షణం ఆర్థిక సాయం అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. లేకుంటే ఆందోళన చేస్తామని, నష్టపోయిన రైతులకు సిపిఎం అన్నివేళలా అండగా ఉంటుందని, రైతులు ధైర్యంగా ఉండాలని కోరారు.

➡️