కాలువలోకి దూసుకుపోయిన బైక్  

May 18,2024 16:09 #Bapatla District

వ్యక్తి మృతి 

ప్రజాశక్తి – మార్టూరు రూరల్ : బైక్ అదుపు తప్పి కాలువలోకి దూసుకుపోయిన ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన మండల పరిధిలోని జంగమహేశ్వరపురం పంచాయతీ లిమిట్స్ లో వలపర్ల – కొమ్మినేనివారిపాలెం మధ్య కొమ్మూరు మేజర్ కాలువలో శనివారం చోటుచేసుకుంది. మృతుడి బంధువుల కధనం ప్రకారం.. బల్లికురవ మండలం కొణిదెన గ్రామానికి చెందిన తన్నీరు లక్ష్మయ్య (60) ఆధ్యాత్మికంగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటాడు. ఈ క్రమంలో బ్రహ్మంగారి మఠంలో జరిగిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడానికి తన గ్రామం నుండి అద్దంకి చేరుకొని అక్కడి నుండి తెలిసిన వారి కారులో మఠం వెళ్లి వచ్చారు. తిరుగు ప్రయాణంలో అద్దంకిలో ఉంచిన తన బైక్ తీసుకొని శనివారం కొణిదెన వెళ్ళడానికి ధర్మవరం మీదుగా వస్తున్నాడు. ఈ నేపథ్యంలో లక్ష్మయ్య బైక్ జంగమహేశ్వరపురం పరిధిలో ఒక్కసారిగా అదుపు తప్పి కొమ్మూరు మేజర్ కాలువలోకి దూసుకుపోయింది. కొద్దీ సేపటికి అటుగా వెళుతున్న వాహనదారులు జరిగిన ప్రమాదాన్నిగుర్తించి స్పందించారు. ముందుగా గుంటుపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ ప్రధమ చికిత్స అందించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరు సర్వజన సమగ్ర వైద్యశాలకు రిఫర్ చేశారు. సమయానికి 108 వాహనం అందుబాటులోకి రాకపోవడంతో అప్పటికే అక్కడకు చేరుకున్న లక్ష్మయ్య బంధువులు హుటాహుటిన ప్రైవేట్ కారులో మార్టూరు లోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఎక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగిన క్రమం తప్పకుండ పాల్గొనే లక్ష్మయ్య ఆకస్మికంగా మృతి చెందడంతో కొణిదెన గ్రామం లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

➡️