టిడిపి తోనే రాష్ట్ర భవిష్యత్తు : టిడిపి బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు, ఎమ్మెల్యే ఏలూరి

Mar 2,2024 23:27

ప్రజాశక్తి – మార్టూరు రూరల్
భవితరాల భవిష్యత్తుకు టిడిపి అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం అవశ్యమని, ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి మద్దతు తెలపాల్సిన సమయం ఆసన్నమైందని టిడిపి బాపట్ల పార్లమెంటు అధ్యక్షులు, ఎంఎల్‌ఎ ఏలూరి సాంబశివరావు అన్నారు. తన క్యాంప్ కార్యాలయంలో టిడిపి నాయకులు, కార్యకర్తలతో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో అయన మాట్లాడారు. వైసిపి పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుక బాటుకు గురైందని అన్నారు. అభివృద్ధిలో పరుగులు తీయాల్సిన రాష్ట్రం అచేతన స్థితిలో ఉందని అన్నారు. టిడిపి ప్రభుత్వ హయాంలో అన్ని రంగాల్లో అగ్రభాగాన ఉంటే నేడు అదమస్థితిలో ఉందన్నారు. రాష్ట్రం అభివృద్ధిలోకి రావాలంటే విజనరీ నేత చంద్రబాబుతోనే సాధ్యమని అన్నారు. గత ఐదేళ్లుగా అరాచకం, విధ్వంసం, దోపిడీ తప్ప అభివృద్ధి లేదన్నారు. బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే టిడిపితో కలిసి రావాలని కోరారు.
జగన్ పాత్రపై విచారణ జరపాలి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్‌రెడ్డి పాత్రపై విచారణ జరపాలని ఎంఎల్‌ఎ ఏలూరి సాంబశివరావు డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ధికోసం వైఎస్ వివేకానందరెడ్డిని హతమార్చిన హంతక ముఠాను జగన్ మోహన్ రెడ్డి కాపాడుతున్నారని ఆరోపించారు. సీబీఐ విచారణ పిటిషన్ వేస్తానని సోదరి సునీత అంటే జగన్ ఎందుకు ఆపారో సమాధానం చెప్పాలన్నారు. మొదట సీబీఐ విచారణ కోరిన జగన్‌రెడ్డి తరువాత వద్దు అనడం వెనుక కారణాన్ని ప్రజలకు వివరించాలని అన్నారు. సీఎం అయిన తరువాత జగన్‌రెడ్డి సీబీఐ విచారణ పిటిషన్‌ను ఎందుకు వెనక్కి తీసుకున్నారని, బాబాయిని చంపిన అబ్బాయిని జగన్‌రెడ్డి రక్షించడం వెనుక ఆంతర్యం ఏమిటిని ప్రశ్నించారు. తన తండ్రికి న్యాయం చేయాలని కూతురు పోరాడుతుంటే తమ్ముడిని సీబీఐ అరెస్టు చేయకుండా జగన్ అడ్డుపడ్డారని అన్నారు. జగన్‌రెడ్డి ఇప్పటికైనా ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి వివేకానందరెడ్డిని చంపిన నిజం ఒప్పుకోవాలని కోరారు. ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు జగన్‌కు కనీస అర్హత లేదని అన్నారు. సోదరికి న్యాయం చేయలేని సీఎం రాష్ట్రంలోని మహిళలకు ఏ విదంగా న్యాయం చేస్తారని ప్రశ్నించారు. వివేకాను చంపిన వారిని వదిలిపెడితే మంచికి, చెడుకు అర్థం లేకుండా పోతుందన్నారు. జరగబోయేది పేదలు, పెత్తందార్లకు మధ్య యుద్ధం కాదని, హంతకులకు, రాష్ట్ర ప్రజలకు మధ్య యుద్ధమని అన్నారు. జగన్ సోదరి సునీత చేస్తున్న న్యాయపోరాటంలో ఆమెకు టీడీపీ అండగా ఉంటుందని అన్నారు. వివేకానందరెడ్డిని క్రూరంగా గొడ్డలితో నరికి చంపిన నరహంతకులకు శిక్ష పడకపోతే రేపు పౌరుని మాన, ప్రాణాలకు రక్షణ ఉండదని అన్నారు.
టిడిపిలోకి ఊపందుకున్న వలసల పర్వం
పర్చూరు నియోజకవర్గంలో పలువురు వైసిపి నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సమక్షంలో టిడిపి కండువ కప్పుకున్నారు. చిన్నగంజాం మండలం పెద్దగంజాం పల్లెపాలెంకు చెందిన 30మంది యువకులు టిడిపి నాయకులు ఆసోది సుబ్బారెడ్డి, గొల్లపోతు వెంకటేశ్వర్లు, దండుప్రోలు తిరుపతిరావు ఆధ్వర్యంలో టిడిపిలో చేరారు. కట్టావారిపాలెంకు చెందిన యువకులు, ఇంకొల్లు మండలం నాగండ్లకు చెందిన యువకులు, మార్టూరుకు నేతాజీ నగర్‌కు చెందిన నాగండ్ల తిరుమల, అద్దేటి అనిల్ ఎమ్మెల్యే ఏలూరి సమక్షంలో టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే ఏలూరి కండువాలు కప్పి టిడిపిలోకి ఆహ్వానించారు.

➡️