కంపచెట్లతో గ్రామస్తుల ఇక్కట్లు

Dec 21,2023 02:22

ప్రజాశక్తి – భట్టిప్రోలు
స్థానిక పిఎసిఎస్‌ చెందిన అద్దేపల్లిలోని పురాతన గోడౌన్‌ను గత కొన్ని నెలల క్రితం స్థానిక అధికార పార్టీ నాయకులు ఆక్రమించేందుకు ప్రయత్నించారు. శిధిలావస్థకు చెందిన గోడౌన్‌లో ఉన్న ఇనుము, ఇనుప రేకులు, తదితర వస్తువులను అక్రమంగా అమ్ముకున్నారు. ఈ స్థలాన్ని ఆక్రమించి మదర్సా నిర్మాణం చేపట్టాలనే దృక్పథంతో పనులు ప్రారంభించారు. కానీ స్థలం సొసైటీకి సంబంధించినది కావడంతో ఎన్ని ప్రయత్నాలు చేసినా ముందుకు సాగలేదు. దీంతో స్థలం నిరుపయోగంగా మారింది. సంబంధిత సొసైటీ అధికారులు దీనిపై ఎలాంటి దృష్టి సారించకపోవడం పట్ల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సొసైటీ స్థలం అన్యక్రాంతం అవుతున్న దృష్ట్యా కొందరు స్థానికులు కోర్టును ఆవిశ్రయించిన సంఘటనలు ఉన్నాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా స్థలం తమదేనంటూ స్థానిక నాయకులు, అధికారులను నమ్మబలికిన ఆక్రమణదారులు తమ పలుకుబడితో ఎన్నో ప్రయత్నాలు చేశారు. దానికి సంబంధించి ఆధారాలు లేకుండా ఎలాంటి చర్యలు చేపట్టలేమని ప్రజాప్రతినిధులు, అధికారులు చెప్పడంతో చేసేదేమీలేక వదిలేసినట్లు తెలిసింది. 70ఏళ్ల క్రితం రేపల్లె ఎఎంసి ఆధ్వర్యంలో నిర్మించిన సొసైటీ గోడౌన్ ప్రభుత్వానికి చెందినదేనని సంబంధిత ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చి ఎవరైనా ఆక్రమిస్తే చట్టపకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ బోర్డులు ఏర్పాటు చేశారు. దీంతో ఆ స్థలంలో ఎలాంటి పనులు చేపట్టకుండా నిలిచిపోయింది. ప్రస్తుతం పిచ్చి చెట్లు పెరిగి పాములు, విష పురుగులకు నిలయమైందని, అధికారులు చర్యలు తీసుకుని బాగు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

➡️