కోల్డు స్టోరేజీలకు మరమ్మత్తులు చేయిస్తాం

Nov 29,2023 00:24

ప్రజాశక్తి- సంతమాగులూరు
రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్ కమిటీ గోదాముల్లో ఆరు నెలల పాటు నామమాత్రపు రుసుం చెల్లింపులతో నిల్వ ఉంచుకొనే అవకాశం కల్పిస్తున్నామని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయ, వాణిజ్య, మార్కెటింగ్ శాఖాధికారి కె రమేష్ బాబు కోరారు. మండలంలోని పుట్టా వారిపాలెం గ్రామంలోని సంతమాగులూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో మంగళవారం వివిధ రికార్డులను పరిశీలించారు. అడ్డరోడ్ జంక్షన్‌లోని చెక్ పోస్ట్ నందు సెస్ రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ జిల్లాలో 28చెక్ పోస్టులు ఉన్నాయని అన్నారు. వాటి ద్వారా ఏటా రూ.7కోట్ల ఆదాయం వస్తుందని అన్నారు. ఏడాది రైతులకు వర్షాభావ పరిస్థితి, సాగునీటి ఇబ్బందులు వలన పంటల ఉత్పత్తుల శాతం తగ్గిందని అన్నారు. ప్రస్తుతం జిల్లాలో ఉన్న గోదాములకు మరమ్మత్తులు జరిపేందుకు రూ.5కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు రూపొందించామని అన్నారు. త్వరలోనే అన్ని గోదాములు మరమ్మత్తులు పూర్తి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ సెక్రటరీ సి చార్లెస్, గాడ్ కె ప్రభాకర్ పాల్గొన్నారు.

➡️