సంక్షోభంలో ముస్లింల సంక్షేమం

Feb 25,2024 23:09

– జగన్‌రెడ్డి కనుసన్నల్లోనే ముస్లింలపై దాడులు
– ముస్లింలకు తీవ్ర అన్యాయం చేసిన వైసిపి
– ముస్లింల సంక్షేమ పథకాలన్నీ పునరుద్ధరిస్తాం
– మండలి మాజీ ఛైర్మన్‌ షరీఫ్‌, ఎంఎల్‌ఎ ఏలూరి
ప్రజాశక్తి -పర్చూరు
సీఎం వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి హయాంలో ముస్లిం మైనారిటీల సంక్షేమాన్ని సంక్షోభంలోకి నెట్టివేశారని శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఎ షరీఫ్, టిడిపి బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, టిడిపి అధికార ప్రతినిధి, గుంటూరు టిడిపి ఇన్చార్జ్ నసిర్ అహ్మద్, మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా మస్తాన్ అహ్మద్ అన్నారు. స్థానిక అద్దంకి నాంచారమ్మ కళ్యాణ మండపం వద్ద ఘర్ ఘర్ కా చంద్రబాబు హమారా కార్యక్రమంలో భాగంగా జరిగిన సభలో మాట్లాడారు. ముస్లిం ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ముస్లింలపై దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని అన్నారు. అధికారం కోసం ముస్లింల ఓట్ల కోసం ముసలి కన్నీరు కార్చిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లిముల సంక్షేమాన్ని విస్మరించారని అన్నారు. ముస్లింల అభ్యున్నతిని విస్మరించి వారికి మొండి చేయి చూపారని ఆరోపించారు. టిడిపి ప్రభుత్వంలో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలన్నీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేయకుండా రద్దుచేసి ముస్లింలను దగా చేశారని అన్నారు. రాష్ట్రంలో మైనారిటీ వర్గాలపై వంద మందికిపైగా దాడులు, హత్యలు, ఆత్మహత్యలకు వైసిపి ప్రభుత్వం వేధింపులే కారణమని అన్నారు. మైనారిటీ వర్గాలను చిత్రహింసలకు గురిచేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదేనని అన్నారు. ముస్లిం మైనారిటీలకు అనేక హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా మోసం చేశారని అన్నారు. ముస్లింల సంక్షేమం అభివృద్ధికి టిడిపి కట్టుబడి ఉందన్నారు. టిడిపి ప్రభుత్వ హయాంలో ముస్లింలకు అనేక రకాల అభివృద్ధి ఫలాలు అందించామని గుర్తు చేశారు. 50శాతం సబ్సిడీతో రూ.2లక్షల వరకు రుణాలు రూ.50కోట్లతో నూర్ భాషా ఫెడరేషన్ ఏర్పాటు చేశామని అన్నారు. పేద ముస్లిం విద్యార్థులకు ఉర్దూ ఇంగ్లీష్ మీడియంలో గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి స్కాలర్షిప్లు అందించినట్లు తెలిపారు. పేద ముస్లిం విద్యార్థులకు విదేశీ విద్యకు రూ.10లక్షల ఆర్థిక సహాయం చేసినట్లు గుర్తు చేశారు. దుల్హన్ పథకం ద్వారా రూ.50వేలను ఎలాంటి షరతులు లేకుండా 38వేల మందికి ఆర్థిక సహకారం అందించినట్లు తెలిపారు. 300కుపైగా సాధిఖానాలను ఏర్పాటు చేసి అత్యాధునిక హంగులతో నిర్మించామని అన్నారు. ఇళ్ల నిర్మాణం, ముస్లిం యువతకు ఉపాధి అవకాశాలు, వేలాది మసీదులకు మరమ్మత్తులు, పునర్నిర్మాణం, ఉర్దూ భాషకు అధికార భాషగా గుర్తింపునకు టిడిపి కృషి చేసిందని అన్నారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని అన్నారు. ముస్లింల అభ్యున్నతి లక్ష్యంగా టిడిపి పనిచేస్తుందని పేర్కొన్నారు. తొలుత అతిధులకు ముస్లిం సోదరులు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్చం అందించి శాలువాలతో సత్కరించారు. టిడిపి రాష్ట్ర ఆర్గనైన్ సెక్రటరీ అబ్దుల్ రజాక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో టిడిపి బాపట్ల పార్లమెంటు కార్య నిర్వాహక కార్యదర్శి జమాలుద్దీన్, మండల ప్రధాన కార్యదర్శులు కాసిం, ఆజాద్, హుస్సేన్, రఫీ, అబ్దుల్ మునీఫ్, ఫరీద్, మస్తాన్ ,షేక్ హుస్సేన్, షేక్ రసూల్, హుస్సేన్, గౌస్, హుస్సేన్, బాబర్, మస్తాన్ పాల్గొన్నారు.


ఇంకొల్లు రూరల్‌ : మండలంలోని 200మంది ముస్లింలు పర్చూరులో జరిగిన ఆత్మీయ సమావేశానికి ముస్లిం మైనార్టీ సంఘ మండల అధ్యక్షులు షేక్ బాబర్ భాష ఆధ్వర్యంలో తరలి వెళ్లారు. కార్యక్రమంలో డాక్టర్ రఫీ, మీరావలి, మస్తాన్ బాబా, మహమ్మద్ అలీ, మస్తాన్‌వలి, రబ్బాని, సుభాని, మౌలాలి, ఖాజావలి, షేక్ జాను, షేక్ సుల్తానా, మీరాభి, పర్వీన్, మాబుల్లా, జహ్రాబీలతో పాటు 200మంది కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు.

➡️