సంక్షేమ పధకాలే వైసిపి అజెండా

Mar 30,2024 00:14 ##ysrcpnews #vemuru

ప్రజాశక్తి – వేమూరు
సిఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాయని, దీని దృష్ట్యా ప్రజలందరూ మరో సారి వైసీపీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని వైసిపి ఇన్చార్జి, ఎంఎల్‌ఎ అభ్యర్థి వరికూటి అశోక్ బాబు ధీమా వ్యక్తం చేశారు. అమృతలూరు మండలం కూచిపూడి గ్రామంలోని వైసిపి కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను నియోజకవర్గానికి కొత్త వ్యక్తి అయినప్పటికీ ప్రజలంతా జగన్మోహన్‌రెడ్డిని, ఆయన పాలనను చూసి తనను ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. గత మూడు నెలలుగా తన కుటుంబం మొత్తం ఇక్కడే నివాసం ఉంటూ ప్రజల వద్దకు వెళ్లి గడప గడపకు తిరిగి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఆదరణ పొందుతున్నామని అన్నారు. టిడిపి అభ్యర్థి, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఎక్కడో దూరంగా గుంటూరులో నివాసం ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండే పరిస్థితి లేదని ఆరోపించారు. ప్రజలకు ఏ అవసరం వచ్చినా గుంటూరుకి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడు తుందని అన్నారు. తనతో పాటు కుటుంబం మొత్తం నిరంతరం ప్రజల వద్దకు వెళ్లి కలుస్తుండటంతో గమనించిన ఆనందబాబు కూడా నియోజకవర్గంలోనే నివాసం ఉండే వధంగా సిద్ధపడుతున్నట్లు తెలిసిందని అన్నారు. ఏ పార్టీ పాలనలో అభివృద్ధి జరిగిందో చర్చించటానికి వైసీపీ తరఫున తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. టిడిపి నాయకులు పేద ప్రజలపై బెదిరింపులకు, కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నట్లు ఆరోపించారు. అలాంటి వాటిని ఎదుర్కొనేందుకు వైసిపి నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో చుండూరు, అమర్తలూరు, వేమూరు, కొల్లూరు మండలాల వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

➡️