క్షయ వ్యాధి నివారణకు బీసీజీ టీకాలు

May 16,2024 23:20 #BCG Vaccine
BCG Vaccination

ప్రజాశక్తి -యంత్రాంగం ఆనందపురం : పెద్దలకు క్షయ వ్యాధి రాకుండా ఉండటానికి అందరూ బీసీజీ టీకాలు వేయించుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ జగదీశ్వరరావు కోరారు. మండలంలోని చందక, బోయపాలెంలో పెద్దలకు వేస్తున్న క్షయ టీకాల కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ పి.జగదీశ్వరరావు, టీకాల కార్యక్రమం రాష్ట్ర పరిశీలకులు నిర్మలగౌరి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా డిఎం అండ్‌ హెచ్‌ఒ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా గురువారం బీసీజీ టీకాల కార్యక్రమం ప్రారంభమైందన్నారు. సుగర్‌ వ్యాధి ఉన్నవారు, 60 ఏళ్లు నిండిన వారు, బిఎంఐ 18 లోపు ఉన్న వారు, క్షయవ్యాధిగ్రస్తుని ఇంట్లో ఉన్న ఇతర సభ్యులు, పొగ తాగే అలవాటు ఉన్నవారు, ఈ టీకాలు వేయించుకోవాలని సూచించారు. రాష్ట్ర పరిశీలకులు డాక్టర్‌ నిర్మలగౌరి మాట్లాడుతూ, ఈ టీకాల కార్యక్రమం వల్ల ప్రజలు క్షయ వ్యాధి బారిన పడుకుండా ఉంటారన్నారు. ఈ టీకాల కార్యక్రమం ప్రతి గురువారమూ జరుగుతుందన్నారు. ఎంపిక చేసిన అందరికీ టీకాలు అందేలా చూడాలని ఆమె అధికారులకు, సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఆనందపురం జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్‌ పుర్ణేంద్రబాబు, జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ ఉమావతి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారులు డాక్టర్‌ ఎం.గంగునాయుడు, షహనాజ్‌ సాధీయ, సామాజిక ఆరోగ్య అధికారి పి.సాంబమూర్తి, జిల్లా కేంద్రం ఆరోగ్య విస్తరణాధికారి నాగభూషణం, ఆరోగ్య పర్యవేక్షకులు కృష్ణమోహన్‌, పార్వతమ్మ, టిబి జిల్లా కేంద్రం కో-ఆర్డినేటర్‌ శ్రీనివాస్‌, టిబి సూపర్‌వైజర్‌ సురేష్‌ తదితరులు పాల్గొన్నారు మధురవాడ : మధురవాడ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ఆధ్వర్యాన సచివాలయం వద్ద బీసీజీ టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో యుపిహెచ్‌సి ఆరోగ్య సిబ్బంది, సీనియల్‌ టీబీ ల్యాబ్‌ సూపర్‌వైజర్‌ వి.వీరబ్రహ్మం పాల్గొన్నారు.

➡️