చిత్రకళపై ఇష్టం.. విస్తర్లపై భగత్‌ సింగ్‌ చిత్రం..

Jun 17,2024 00:31

ప్రజాశక్తి – మంగళగిరి : పెంయింటింగ్‌పై మక్కువ పెంచుకున్న పఠాన్‌ జైనాబ్‌ఖాన్‌ విద్యార్థి దశలోనే రికార్డులు సంపాదించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం స్వాతంత్య్ర సమరయోధుడు, విద్యార్థి, యువతకు నిత్య చైతన్య స్ఫూర్తి అయిన భగత్‌సింగ్‌ చిత్రపటాన్ని ఎంచుకున్నారు. స్థానిక టిప్పల బజారులో నివాసం ఉండే జైనాబ్‌ ఖాన్‌ స్థానిక నారాయణ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్నారు. చిన్నప్పటి నుండి చిత్ర కళలపై ఆసక్తి ఉన్న జైనాబ్‌ ఖాన్‌ వారం కిందట పట్టణంలోని షాదీఖానాలో 12×10 సైజులో 300 విస్తరాకులపై భగత్‌సింగ్‌ చిత్రపటాన్ని వేశారు. మధ్యాహ్నం 17 గంటల నుండి రాత్రి 7 గంటల వరకూ ఇందుకోసం సమయం వెచ్చించారు. ఈ చిత్రాన్ని అంతర్జాతీయ రికార్డులు ప్రకటించే ఓ సంస్థకు పరిశీలన నిమిత్తం పంపించారు. ఆర్టిస్టుగా అంచలంచెలుగా ఎదుగుతూ వరల్డ్‌ రికార్డ్‌ సాధించే ప్రయత్నంలో ఉన్నట్లు జైనాబ్‌ఖాన్‌ ఈ సందర్భంగా చెప్పారు. తమ కుటుంబీకులైన ఆలీబాషాఖాన్‌ సోదరుల అండదండలు, ప్రోత్సాహంతో తాను ఎన్నో మంచి చిత్రాలు వేస్తానని అన్నారు. చదువుల్లోనూ ఉన్నతంగా రాణించి అత్యున్నత స్థాయికి చేరాలనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

➡️