ఆశీర్వదించి గెలిపించండి: ముత్తుముల

ప్రజాశక్తి-గిద్దలూరు రూరల్‌: గిద్దలూరు నియోజకవర్గ ప్రజలు తమ ఇంటి బిడ్డగా ఆశీర్వదించి తనను గెలిపించా లని, ఫలితంగా నియోజక వర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని టిడిపి గిద్దలూరు అసెంబ్లీ అభ్యర్థి ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. శుక్రవారం గిద్దలూరు మండలంలో తాళ్లపల్లె, కొమ్మునూరు, బ్రాహ్మణపల్లె, ఎగ్గన్నపల్లె, వేములపాడు, నల్లగట్ల, వెంకటాపురం, బురుజుపల్లె గ్రామాలలో పర్యటించి తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేశారు. మహాశక్తి పథకం ద్వారా తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి, దీపం పథకం, ఉచిత బస్సు ప్రయాణం, కలలకు రెక్కలు వంటి పథకాల ద్వారా మహిళా సంక్షేమానికి కూటమి కృషి చేస్తుందని అన్నారు. ఓటమి భయంతో వైసీపీ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని, ప్రజలు వారి మాటలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. స్థానికంగా ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని, పక్క నియోజకవర్గాల నుంచి గిద్దలూరుకు ట్రాన్స్‌ఫర్‌ అయి వచ్చిన వ్యక్తులను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగుంట శ్రీనివాసులురెడ్డికి సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు.

➡️