రక్తదానం అంటే ప్రాణదానమే

Kanaka mahalaxmi bank blood donation camp

ప్రజాశక్తి- విశాఖ కలెక్టరేట్‌ : రక్తదానం అంటే ప్రాణదానమేనని కనకమహాలక్ష్మి కో-ఆపరేటివ్‌ బ్యాంకు చైర్మన్‌ కొమ్మారెడ్డి రాంబాబు అన్నారు. స్వయంగా ఆయన రక్తదానం చేశారు. అక్కయ్యపాలెంలోని బ్యాంకు ప్రధాన కార్యాలయంలో, ఆదివారం రక్తదాన శిబిరం, ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలన్నారు. బ్యాంకు 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని రజతోత్సవం చేసుకుంటున్న సందర్భంలో ఉచిత వైద్య శిబిరం, రక్తదాన శిబిరాలను నిర్వహించినట్లు తెలిపారు. రక్తదానం చేయడంలో బ్యాంకు సిబ్బంది, ఖాతాదారులు, శ్రేయోభిలాషులు కూడా భాగస్వాములు కావడం హర్షించదగిన విషయం అన్నారు. తొలుత బ్యాంకు చైర్మన్‌ కొమ్మారెడ్డి రాంబాబు, ఎయు మాజీ రిజిస్ట్రార్‌, లయన్స్‌ కేన్సర్‌ ఆసుపత్రి మేనేజింగ్‌ ట్రస్టీ ఆచార్య వెలగపూడి ఉమామహేశ్వరరావు కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బ్యాంకు సిబ్బందికి, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు లీ ఫార్మా లిమిటెడ్‌చే సుగర్‌, బిపి, ఎముకల పటుత్వం పరీక్షలను నిర్వహించి, అవసరమైన వారికి మందులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన వైద్య, బ్యాంకు సిబ్బందికి బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణాధికారి కె.శ్యాంకిషోర్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు డైరెక్టర్లు డాక్టర్‌ మోటూరు శ్రీరామకృష్ణ, బి.నాగేశ్వరరావు, పిఆర్‌ఒ జిఎస్‌.శివప్రకాష్‌ పాల్గొన్నారు.

➡️