ఇంకుతున్న నీరు..ఎండి పోతున్న బోర్లు

May 22,2024 19:55

అధిక సంఖ్యలో మరమ్మత్తులకు గురైన బోర్లు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  వేసవి తీవ్రత ఎక్కువగా ఉండటంతో నగరంలో రోజు రోజుకూ నీటిసమస్య అధికమవుతోంది. తాగునీటికి ముషిడిపల్లి, నెల్లిమర్ల పంప్‌ హౌస్‌ల నుంచి వచ్చే నీరే నగరంలో ఉన్న మూడున్నర లక్షలమందికి ఆధారం. రెండు పంప్‌ హౌస్‌ల నుంచి వస్తున్న నీరు కేవలం తాగేందుకు మాత్రమే సరిపోతుంది. అధి కూడా రెండు రోజులు కు ఒక సారి సరఫరా చేస్తున్నారు. దీంతో నగర ప్రజలు నీటి అవసరాలు దృష్ట్యా నగరంలో సుమారుగా 1100 చేతి పంపు బోర్లు ఉన్నాయి. ఈ బోర్లలో సుమారుగా 300కు పైగా బోర్లు మరమ్మత్తులకు గురయ్యాయి. మరో 250కి పైగా బోర్లులో నీరు ఇంకిపోయి వృథాగా దిష్టి బొమ్మల్లా మారాయి. ఏడాదిగా వీటి గురించి పట్టించుకోకపోవడంతో ఒక్కొక్కటిగా పాడైపోతున్నాయి. రోజురోజుకూ నీటి అవ సరాలు పెరుగుతున్నాయి. విజయనగరంలో కుళాయిల ద్వారా ఇస్తున్న నీరు ఎటూ సరిపోని పరిస్థితులు నెలకొన్నాయి. పైగా వీధుల్లో ఉన్న చేతి పంపులు మొరాయిస్తున్నాయి. మరమ్మతుల్లేక బోరుమంటున్నాయి. నగరంలో డివిజన్‌ పరిధిలోని నాగోజిపేట ప్రాంతంలోనే మూడు బోర్లు పాడయ్యాయి. కణపాక లో ఉన్న బోర్లలో నీరు ఇంకిపోతోంది. గత ఆరు నెలల నుంచి బోర్ల మరమ్మతుకు సామగ్రి కొనుగోలులో అధికారులు నిర్లక్ష్యం వహించారు. కంటోన్మెంట్‌ ప్రాంతంలో సుమారుగా 20పైగా ఉన్నాయి. వాటిలో పదికి పైగా నీరు లేక దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయి. మరి కొన్ని మరమ్మత్తులకు గురయ్యాయి. నగరంలో 50 డివిజన్లలోని అన్ని బోర్లదీ ఇదే పరిస్థితి. దీంతో బోర్లు ఆధారంగా ఉన్న కాలనీలు, శివారు ప్రాంతాల్లో నీటి ఇబ్బందులు అధికంగా ఉన్నాయి. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించడానికి ఒక రోజు ముందు బోర్ల మరమ్మతులకు టెండర్లు పిలిచారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడంతో టెండర్లు తెరవలేని పరిస్థితి నెల కొంది. టెండర్లు తెరిచేందుకు జిల్లా ఎన్నికల అధికారి నుంచి అనుమతికి ఇంకా రాలేదని డిఇఇ ఎస్‌.అప్పారావు తెలిపారు. మంచినీటి బోర్లు నిర్వహణకు సంబంధించిన అంశం కావడంతో ఎన్నికల కమిషన్‌ నుంచి అనుమతికి ప్రయత్నిస్తున్నట్లు ఆయన చెప్పారు. అయినా నగరంలో ఎక్కడైనా బోర్లు పని చేయకపోతే పిర్యాదు చేస్తే వెంటనే మరమ్మత్తు చేస్తామని డిఇ తెలిపారు.

➡️