బీపీ నియంత్రణలో లేకుంటే బ్రెయిన్‌స్ట్రోక్‌

Jun 17,2024 00:27

డాక్టర్‌ నీరజను సత్కరిస్తున్న అవగాహన సభ్యులు
ప్రజాశక్తి-గుంటూరు :
నరాలకు సంబంధించిన సమస్యల పట్ల అవగాహనతో బ్రెయిన్‌స్ట్రోక్స్‌ నుంచి కాపాడుకోవచ్చని న్యూరాలజిస్ట్‌ డాక్టర్‌ కె.నీరజ తెలిపారు. స్థానిక అరండల్‌పేటలోని అవగాహన కార్యాలయంలో ఆదివారం జరిగిన ఆరోగ్యసభలో న్యూరాలజిస్ట్‌ డాక్టర్‌ కె.నీరజ మాట్లాడారు. నరాలకు సంబంధించిన సమస్యలపై అవగాహన, వాటి పరిష్కారాల గురించి తెలియజేశారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు, రక్తపోటు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని, మధుమేహ వ్యాధిగ్రస్తులు షుగర్‌లెవెల్స్‌ను నియంత్రించుకోకుంటే రెటినోపతి, కార్డియోమయోపతి, న్యూరోపతి, నెఫ్రోపతి మొదలైన సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు. రక్తపోటును నియంత్రణలో ఉంచుకోకుంటే బ్రెయిన్‌ స్ట్రోక్‌కు దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు. బ్రెయిన్‌స్ట్రోక్‌ వచ్చిన సందర్భాల్లో ఎంత త్వరగా న్యూరాలజిస్ట్‌ వద్దకు వెళితే అంత త్వరగా కోరుకునే అవకాశాలు ఉంటాయని, సాధారణంగా బ్రెయిన్‌స్ట్రోక్‌ వచ్చిన నాలుగు గంటలలోపు వైద్యుల వద్దకు వెళ్లగలిగితే చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తాయని తెలిపారు. ఒక్కసారి బ్రెయిన్‌స్ట్రోక్‌ వస్తే జీవితాంతం వైద్యుల సలహా మేరకు మందులు వాడాలన్నారు. ఉన్నట్టుండి నడకలోగానీ, మాటలోగానీ, చూపులోగానీ తేడా గమనిస్తే అవి ఎక్కువ శాతం బ్రెయిన్‌స్ట్రోక్‌కు సంబంధించిన సంకేతాలుగా భావించి వెంటనే న్యూరాలజిస్ట్‌ను సంప్రదించాలని సూచించారు. వెర్టిగో గురించి తెలియజేస్తూ ఈ సమస్య సాధారణంగా శరీరంలో సోడియం లోపించిన సందర్భాల్లో తలెత్తుతుందని, ఈ సమస్యతో బాధపడే వారు ఉప్పు తగ్గించి తీసుకోవాలని, మెదడుకు సంబంధించిన, కళ్లకు సంబంధించిన కొన్ని వ్యాయామాలు వైద్యుల సలహాతో చేయాలని తెలిపారు. పార్కిన్‌సన్‌ వ్యాధితో బాధపడేవారు సరిగా నడవలేరని, చేతులు వణుకుతుంటాయని, ఈ సమస్యకు దాదాపు జీవితాంతం మందులను వైద్యుల సలహాతో తీసుకోవాలని తెలిపారు. దోపమిన్‌ ఉత్పత్తి శరీరంలో లోపించిన వారికి పార్కిన్‌సన్‌ సమస్య ఉత్పన్నం అవుతుందని తెలిపారు. శరీరంలో సోడియం శాతం తగ్గిన వారిలో ఫిట్స్‌ సమస్య వస్తుందన్నారు. ఫిట్స్‌కు సంబంధించి ప్రస్తుతం అందుబాటులో అధునాతన వైద్యం అందుబాటులో ఉందని వివరించారు. ఆహారంలో కార్బోహైడ్రేట్స్‌ శాతం తక్కువగా ఉండాలని 50 శాతం పండ్లు, కూరగాయలు, 25 శాతం రైస్‌, మిగిలిన 25శాతం ప్రోటీన్‌ తీసుకుంటే ఇలాంటి నరాలకు సంబంధించిన వ్యాధులు దరిచేరకుండా ఉండటానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయని వివరించారు. నిద్రలేమి, మైగ్రేన్‌, గురక మొదలైన వ్యాధులకు తగు సలహాలు సూచనలు చేశారు. అనంతరం అవగాహన సభ్యులు డాక్టర్‌ కె.నీరజను సత్కరించారు. సభకు టి.వి.సాయిరాం కో-ఆర్డినేటర్‌గా వ్యవహరించగా, రిటైర్డ్‌ ప్రిన్సిపాల్‌ ముప్పాళ్ల ప్రసాదరావు, సంస్థ సీనియర్‌ సభ్యులు ఆర్‌.రామచంద్రరావు విశ్లేషకులు పాములరెడ్డి పాల్గొన్నారు.

➡️