వైస్‌ ఎంపిపి ఇంట్లో చోరీ

ప్రజాశక్తి-తర్లుపాడు: తర్లుపాడు వైస్‌ ఎంపిపి కందుల సుజాత ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఇంటి తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించి బీరువాలో దాచిన రూ.72,500 నగదు, 3 జతల బుట్ట కమ్మలు, రెండు జతల కమ్మలు, రెండు బాస్‌లెట్లు, 12 ఉంగరాలు కలిపి రూ. 6,00,000 విలువైన ఎనిమిది తులాల బంగారాన్ని అపహరించారు. పోలీసుల కథనం ప్రకారం… తర్లుపాడు మండలం నాగేండ్ల ముడుపు ఎస్‌సి కాలనీకి చెందిన తర్లుపాడు వైస్‌ ఎంపిపి కందుల సుజాత భర్త ఎలీషా సోదరుడు కర్ణాటక రాష్ట్రంలోని బెలగాం ప్రాంతంలో స్థిరపడ్డాడు. ఇటీవల ఆయన మృతి చెందాడు. దీంతో ఇంటికి తాళం వేసి వైస్‌ ఎంపిపి తమ కుటుంబ సభ్యులతో కలిసి బెలగాం వెళ్లారు. పెద్దకర్మ అయ్యే వరకూ అక్కడే ఉండి రావాలని భావించారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళం పగులగొట్టి చోరీ పాల్పడ్డారు. వైస్‌ ఎంపిపి కుటుంబ సభ్యులు స్వగ్రామానికి బయలు దేరాడు. సోమవారం రాత్రికి వైస్‌ ఎంపిపి పుట్టినిల్లు అయిన బేస్తవారిపేట మండలం సలకలవీడు గ్రామానికి చేరుకున్నారు. వైస్‌ ఎంపిపి తమ్ముడు అబ్రహం లగేజీ తీసుకొని మంగళవారం ఉదయం నాగేండ్ల ముడుపు గ్రామానికి వచ్చాడు. ఇంటి తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గమనించి లోనికి వెళ్లి చూశాడు. బీరువాలు పగలగొట్టి ఉండడంతో దొంగతనం జరిగినట్లుగా గుర్తించి సుజాతకు సమాచారం అందించాడు. దీంతో సుజాత తమ కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామానికి వచ్చారు. చోరీ గురించి ఎస్‌ఐ వేముల సుధాకర్‌కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌ టీంను పిలిపించి ఘటన స్థలంలో వేలిముద్రలు సేకరించారు. బాధితులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

➡️