సకాలంలో గుర్తిస్తే ‘కేన్సర్‌’కు మెరుగైన చికిత్స

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: క్యాన్సర్‌ వ్యాధిని సకాలంలో గుర్తిస్తే మెరుగైన చికిత్సను అందించవచ్చునని నరసరావుపేట శేషాద్రి సూపర్‌ స్పెషాలిటీ హాస్సటల్‌ క్యాన్సర్‌ అంకాలజిస్టు డాక్టర్‌ గోనుగుంట్ల రామకిషన్‌ అన్నారు. ఆదివారం యర్రగొండపాలెం పట్టణంలోని ముస్లిం షాదీఖానాలో యర్రగొండపాలెం ఏరియా గ్రామీణ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో గ్రామీణ వైద్యులకు క్యాన్సర్‌ వ్యాధి పట్ల అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా గోనుగుంట్ల రామకిషన్‌ మాట్లాడుతూ నేడు ప్రపంచంలో క్యాన్సర్‌ కేసులు పెరుగుతున్నా యని తెలిపారు. ఇది చాలా ఆందోళన కలిగించే విషయమని అన్నారు. క్యాన్సర్‌ పట్ల వైద్యులతో పాటు ప్రజలు కూడా అవగాహన కలిగి ఉండాలని వివరించారు. పొగాకు, నిల్వ చేసిన ఆహార పదార్థాలు, అధిక ప్లాస్టిక్‌ వినియోగం, కూల్‌డ్రింకులు, శీతల పానీయాలు, జంక్‌ ఫుడ్‌లు క్యాన్సర్‌కు కారణమవుతున్నాయని చెప్పారు. మారుతున్న ప్రపంచంలో వాతావరణ కాలుష్యం కూడా ఆందోళనకరంగా పరిణమించిందని తెలిపారు. వైద్యులు, వైద్య సిబ్బంది సరైన అవగాహనతో క్యాన్సర్‌ కేసులు నిర్ధారించి సకాలంలో గుర్తిస్తే వైద్యం ద్వారా చాలా వరకు వ్యాధిని తగ్గించవచ్చునని తెలిపారు. క్యాన్సర్‌ వ్యాధిని తగ్గించడానికి ఆపరేషన్లు, రేడియేషన్‌, కీమోథెరపీ వంటి ఆధునిక చికిత్సలతో పాటు మందులు అందుబాటులో ఉన్నాయని అన్నారు. క్యాన్సర్‌ను మొదటి దశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చునని తెలిపారు. అనంతరం ఆయన్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ వైద్యుల సంఘం గౌరవాధ్యక్షుడు షేక్‌ వలీసాహెబ్‌, అధ్యక్షుడు పల్లెపోగు జాషువ, ప్రధాన కార్యదర్శి మల్లికార్జునరావు, కోశాధికారి పఠాన్‌ ఇస్మాయిల్‌ ఖాన్‌, నాయకులు శాంసన్‌, శ్రీనివాసరావు, కోటి తదితరులు పాల్గొన్నారు.

➡️