పదిలో ప్రతిభ చూపిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు

Jun 17,2024 00:24

బహుమతులు అందుకున్న మున్సిపల్‌ పాఠశాలల విద్యార్థులతో ట్రస్ట్‌ బృందం
ప్రజాశక్తి – తెనాలి :
పట్టణానికి చెందిన వేజళ్ల వెంకట సుబ్బారావు మెమోరియల్‌ విద్యా ట్రస్టు ఆధ్వర్యంలో పదో తరగతిలో అత్యధిక ప్రతిభ చూపిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలను అందించారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత వేజళ్ల ఉమామహేశ్వర్‌ నివాసంలో ఆయన అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో తెనాలి పురపాలక పాఠశాలల్లో ప్రతిభ చూపి, 560 మార్కులు పైగా సాధించిన విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.1116 చొప్పున ప్రతిభా పురస్కారాలు అందించారు. నిర్వాహకులు, ట్రస్టు కార్యదర్శి వేజళ్ల నవ్య మాట్లాడుతూ పదేళ్లుగా ట్రస్టు ద్వారా పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, బిసి కాలనీలో వేజళ్ల వెంకట సుబ్బారావు పురపాలక ప్రాథమిక పాఠశాల భవనం నిర్మించటం, ప్లాస్టిక్‌ వినియోగంతో అనర్థాలను వివరించి, ప్రజలకు గుడ్డ సంచులను పంపిణీ చేస్తున్నామని వివరించారు. విద్యార్థి దశలోనే పుస్తక పఠనంపై ఆసక్తి కలిగిస్తూ పలు పాఠశాలలకు గ్రంథాలయ పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేసామని, విద్యార్థుల్లో సృజనాత్మకను వెలికి తీసేందుకు పలు పోటీలు నిర్వహించి, అభినందించడం, ప్రతిభ కనపరచిన పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఆర్థిక చేయూత వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉమామహేశ్వర్‌ మాట్లాడుతూ ఫాదర్స్‌ డే సందర్భంగా తన తండ్రి పేరిట ఏర్పాటు చేసిన ట్రస్ట్‌ ద్వారా విద్యార్థులను ప్రోత్సహించినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఓంకార్‌ గ్రాఫిక్స్‌ ప్రసాదు, సి.ఆర్‌.పి శ్రీదేవి, శివప్రసాద్‌, భాస్కరరావు, శ్యామ్‌ ప్రసాదు, టి.శివప్రసాదు, శ్రీనివాసరావు, బి.శివరామ కృష్ణ, రాజేంద్ర, ఉపాధ్యాయులు, తల్లితండ్రులు పాల్గొన్నారు.

➡️