కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలి

Apr 6,2024 21:37

ప్రజాశక్తి – పాచిపెంట : జాతీయ ఉద్యమ స్ఫూర్తితో పోరాడి సాధించుకున్న హక్కులను భారత రాజ్యాంగాన్ని కాలరాస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలని, వచ్చే ఎన్నికల్లో వీటిని సాగనంపాలని సిపిఎం సీనియర్‌ నాయకులు ఎం.కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. మండలంలోని కోడికాళ్లవలస జంక్షన్‌ వద్ద ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా నాయకులు సూకూరు అప్పలస్వామి అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సభలో కృష్ణమూర్తి మాట్లాడుతూ ఎర్రజెండా నాయకత్వంలో పోరాడి సాధించుకున్న అటవీ హక్కు, ఉపాధి హామీ, కార్మిక హక్కుల చట్టాలను కాలరాస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వం అంబానీ, అదానీల ఆస్తులను పెంచుతూ ప్రజలపైన భారాలు వేస్తోందని విమర్శించారు. వ్యవసాయ రంగాన్ని సర్వనాశనం చేసి తిండిగింజలు లేకుండా చేసి కార్పొరేట్ల చేతుల్లో వ్యవసాయ రంగాన్ని పెడుతుందని పోరాటం చేసిన రైతాంగంపై కాల్పులు జరుపుతూ భయభ్రాంతులకు గురిచేస్తుందన్నారు. ఏడాదికి రెండు కోట్లు ఉద్యోగాలు అని చెప్పి యువతను మోసగించిందని, మతం పేరుతో ప్రజలను చీల్చుతూ కలిసి ఉన్న కుటుంబాలను విడదీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మణిపూర్‌లో జరిగిన గిరిజనులపై దాడులు, అత్యాచారాలను దేశ ప్రజలంతా ఖండించాలని, పోరాడి సాధించుకునే గిరిజన చట్టాలను కాపాడుకోవాలని, మూసి ఉన్న పరిశ్రమలు తెరిపించేలా యువతకు ఉపాధి కల్పించాలని, ప్రభుత్వ రంగ సంస్థల కాపాడుకోవాలని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని కోరారు. నిత్యం ప్రజల కోసం పనిచేస్తున్న సిపిఎం అభ్యర్థులను గెలిపించుకోవాలని, ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేసిన బిజెపిని తిప్పి కొట్టాలని, ఇంత ద్రోహం చేసిన బిజెపికి మద్దతు ఇచ్చే పార్టీలన్నింటినీ వ్యతిరేకించి ఎర్రజెండా అభ్యర్థులను గెలిపించుకొని హక్కుల సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోరాడ ఈశ్వరరావు, మర్రి శ్రీనివాసరావు, గిరిజన సంఘం జిల్లా కమిటీ సభ్యులు మంచాల శ్రీనివాసరావు, జర్నీ రామయ్య, నిర్వాసిత సంఘం నాయకులు బి.అభిమన్యుడు, రైతు సంఘం మండల కార్యదర్శి బి.గౌర్నాయుడు తదితరులు పాల్గొన్నారు. కొమరాడ : నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతున్న ఎర్రజెండా తరపున పోటీ చేసే ఎంపి, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని సిపిఎం నాయకులు కొల్లి సాంబమూర్తి పిలుపునిచ్చారు. శనివారం కూనేరు సంతలో సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సాంబమూర్తి మాట్లాడుతూ గిరిజన ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యల పైన పోరాడుతున్న సిపిఎం తరపున కురుపాం ఎమ్మెల్యే అభ్యర్థి మండంగి రమణను, అరకు పార్లమెంటు అభ్యర్థి అప్పలనర్స పోటీ చేస్తున్నారన్నారు. వీరికి అత్యధిక ఓట్లు వేసి గెలిపించేందుకు గిరిజన యువతీ యువకులు ముందుకు రావాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన హక్కులను కాలరాసేలా రోజుకొక చట్టాన్ని తెచ్చి గిరిజన బతికులను విస్తరాకు మాదిరిగా చిందరవందర చేసే పరిస్థితి ఉందన్నారు. ఇలాంటి సందర్భంలో ఈరోజు రాష్ట్రంలో అన్ని పార్టీలు కుస్తీ పడుతూ కేంద్రంలో దోస్తీగా కలిసిపోయే ఈ పార్టీలను నమ్మొద్దని ఆన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన గిరిజన వ్యతిరేక చట్టాలను ఈ పార్టీలన్నీ బలపరుస్తూ గిరిజనులకు అన్యాయం చేసే పరిస్థితి ఉందని ఇలాంటి సందర్భంలో గిరిజన హక్కులు కాపాడేలా సిపిఎం తరఫున ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు పోరాటం చేసే పరిస్థితి ఉందని, కావున సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రచార కార్యక్రమంలో నాయకులు బాబురావు, గిరిజనులు పాల్గొన్నారు.

➡️