చల్లపల్లి ఇండియన్ బ్యాంక్ ఎదుట మహిళలు ఆందోళన

 ప్రజాశక్తి- చల్లపల్లి : డ్వాక్రా మహిళలను వేధిస్తున్న ఇండియన్ బ్యాంక్ మేనేజర్ ని  సస్పెండ్ చేయాలని పలువురు డిమాండ్ చేశారు.  సంక్షేమ పథకం  లబ్ధిదారులు, డ్వాక్రా మహిళలు ఇండియన్ బ్యాంక్ వద్ద  అఖిలపక్షం ఆధ్వర్యంలో గురువారం  ఆందోళన నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఇస్తున్న  జగనన్న ఆసరా, చేయూత లబ్ధిదారులకు ఇవ్వకుండా బ్యాంక్ మేనేజర్  అడ్డుపడుతున్నారని, లబ్ధిదారులు, డ్వాక్రా సంఘ సభ్యులు ఆవేదన  వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా ఇచ్చిన లబ్ది సొమ్మును సకాలంలో ఇవ్వకుండా ఏదో ఒక సాకు చెప్పి తమకు ఇవ్వట్లేదని వారు ఆరోపించారు . రెండేళ్లుగా రూ.4వేలు కట్టే రుణానికి ఈయన వచ్చి రూ.5వేలు చొప్పున కడితేనే డ్వాక్రా రుణమాఫీ లబ్ధి ఇస్తామంటున్నారని ఆరోపించారు.  బాధితులకు టీడీపీ మండల అధ్యక్షులు, వైస్ ఎంపీపీ మోర్ల రాంబాబు, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి అడ్డాడ ప్రసాద్ బాబు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మీర్ రిజ్వాన్, జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి ఉస్మాన్ షరీఫ్ మద్దతు తెలిపారు. లబ్ధిదారులను, నిరుపేద డ్వాక్రా మహిళలను వేధిస్తున్న  మేనేజర్ ను  సస్పెండ్ చేయకపోతే బ్రాంచ్ ఎదుట నిరాహార దీక్షలు చేపడతామని వారు హెచ్చరించారు.

➡️