అక్రమార్కులను సాగనంపండి : చంద్రబాబు

May 9,2024 21:43

 ప్రజాశక్తి – కురుపాం/చీపురుపల్లి  : కురుపాం, చీపురుపల్లి నియోజక వర్గాల్లో అక్రమాలకు పాల్పడిన వైసిపి అభ్యర్థులను ఇంటికి సాగనంపాలని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. అధికారంలోకి వస్తే బాదుడు లేని సంక్షేమాన్ని అందిస్తానని తెలిపారు. ఏజెన్సీలోని గుమ్మడిగెడ్డ రిజర్వాయర్‌, పూర్ణపాడు-లాబేసు వంతెన పూర్తి చేస్తామని మరోసారి హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం కురుపాంలోని రావాడ జంక్షన్‌ వద్ద, చీపురుపల్లి జంక్షన్‌లో జరిగిన సభల్లో చంద్రబాబు ప్రసంగించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తోటపల్లి కుడి కాలువకు రూ.45కోట్లు నిధులు మంజూరు చేసి కొమరాడ, జియ్యమ్మ వలస, గరుగుబిల్లి మండలాలకు వేల ఎకరాల సాగుభూమికి నీరు అందిస్తామని చెప్పారు. టిడిపి ప్రభుత్వ హయాంలో గిరిజనులకు 60 శాతం సబ్సిడీతో ట్రైకార్‌ రుణాలు ఇచ్చామని, గిరిజన ప్రజల కోసం 16 సంక్షేమ పథకాలు తీసుకొచ్చామని చెప్పారు. ఈ పథకాలన్నీ జగన్‌ రెడ్డి తీసేసి గిరిజనులకు అన్యాయం చేశాడని, నవరత్నాల పేరుతో నవ మోసాలకు గురి చేశారని విమర్శించారు. నిరుద్యోగ యువతకు జాబ్‌ కార్డు విడుదల చేస్తానని హామీ ఇచ్చి జాబు కార్డును మరిచిన ఘనత జగన్‌ దేనని విమర్శించారు. ఇటువంటి వైసిపి ప్రభుత్వానికి ఇంటికి సాగింపడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉండాలని అన్నారు. ఈ ప్రాంతంలో దీర్ఘకాలికంగా ఉన్న ఏనుగుల సమస్యలు పరిష్కరిస్తామని, గిరిజనుల కోసం అల్లూరి సీతారామరాజు పేరుతో ప్రత్యేక మ్యూజియం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్రలో ఉన్న వైజాగ్‌ను దోచేస్తుంటే బొత్స సత్యన్నారాయణ ఎందుకు అడగలేదని చంద్రబాబు ప్రశ్నించారు. బొత్స సత్యనారాయణ (మిగతా..2లో)జిల్లాకు ఏం ఉద్దరించారో చెప్పాలన్నారు. విజయనగరం జిల్లాలో బొత్స కుటుంబీకులే ఎంఎల్‌ఏలుగా, ఎంపిలుగా ఉండాలా? వేరే వారు ఉండకూడదా అని చంద్రబాబు ప్రశ్నించారు.

అక్రమార్కులను సాగనంపండి : చంద్రబాబు

ఉత్తరాంధ్రలో వెనుకబడిన నాయకుల పెత్తనం ఉండాలి తప్ప విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి పెత్తనం ఏమిటని అన్నారు. ‘నరేంద్రమోడీ అవినీతిపరుడని బొత్స అంటున్నారు.. ధైర్యం ఉంటే జగన్‌మోహన్‌రెడ్డిని నరేంద్రమోడీపై మాట్లాడమనండి.. అప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి కధేమిటో తేలుతుంది’ అని చంద్రబాబు అన్నారు. ప్రజల జీవితాలు మార్చేందుకు సూపర్‌ సిక్స్‌ పధకాలను తీసుకొచ్చానని చెప్పారు.ఇసుక దోపిడీతోపాటు అన్నింటిలో కూడా దోపిడీకి పాల్పడిన కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణిని ఇంటికి సాగనంపి జగదీశ్వరిని గెలిపించాలని కోరారు. అనంతరం జగనన్న భూ హక్కు పధకం కాగితాల్ని చింపివేసి ల్యాండ్‌ టైట్టింగ్‌ యాక్టు కాపీని దగ్ధం చేశారు. కార్యక్రమంలో అరకు పార్లమెంట్‌ బిజెపి అభ్యర్థి కొత్తపల్లి గీత, టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వరి, మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌, టిడిపి రాష్ట్ర కార్యదర్శి వైరచర్ల వీరేష్‌ చంద్రదేవ్‌, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దత్తి లక్షణరావు, జనసేన నియోజకవర్గ ఇన్చార్జి కడ్రక మల్లేశ్వరరావు, టిడిపి నాయకులు కోలా రంజిత్‌ కుమార్‌, డొంకాడ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. చీపురుపల్లి సభలో అభ్యర్థి కిమిడి కళావెంకటరావు, విజయనగరంఎంపి అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు, జిల్లా అధ్యక్షులు కిమిడి నాగార్జున, గద్దే బాబూరావు, కె.త్రిమూర్తుల రాజుతో పాటు జనసేన నాయకులు కోట్ల కృష్ణ, విసినిగిరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

➡️