అరాచక పాలనకు స్వస్తి పలకాలి : చంద్రబాబు

May 9,2024 21:46

 ప్రజాశక్తి-చీపురుపల్లి/కురుపాం :  హింసా రాజకీయాలకు, అరాచక పాలనకు స్వస్తి పలకాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అద్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం చీపురుపల్లి, కురుపాంలో ఏర్పాటు చేసిన సభల్లో ఆయన ప్రసంగించారు. ఐదేళ్ల పాలనలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. అసలు బటన్‌ నొక్కిప్రజలకు ఇచ్చిందెంత జగన్‌మోహన్‌రెడ్డి మెక్కిందెంత అని ఎద్దేవా చేసారు. తొమ్మిది దఫాలు విద్యుత్‌ ఛార్జీలను వైసిపి ప్రభుత్వం పెంచిందన్నారు. అరవై రూపాయలున్న మద్యం క్వార్టర్‌ ధరను రెండు వందల రూపాయలు చేసి మిగిలిన 140 రూపాయలను తాడేపల్లి పేలస్‌ ఖాతాలో వేసుకున్నాడని ఆరోపించారు. జగన్‌మోహన్‌రెడ్డి అప్పులు చేసి బటన్‌ నొక్కాడని, తాను మాత్రం అలా చేయకుండా సంపద సృష్టించి వచ్చే ఆదాయాన్ని ప్రజలకు సంక్షేమ రూపంలో అందిస్తామని అన్నారు. వైసిపి పార్టీ అరాచకానికి మారుపేరుగా నిలిచిందన్నారు. విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్రలో ఉన్న వైజాగ్‌ను దోచేస్తుంటే బొత్స సత్యన్నారాయణ ఎందుకు అడగలేదని చంద్రబాబు ప్రశ్నించారు. బొత్స సత్యన్నారాయణ జిల్లాకు ఏం ఉద్దరించారో చెప్పాలన్నారు. విజయనగరం జిల్లాలో బొత్స కుటుంబీకులే ఎంఎల్‌ఏలుగా, ఎంపిలుగా ఉండాలా? వేరే వారు ఉండకూడదా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఉత్తరాంధ్రలో వెనుకబడిన నాయకుల పెత్తనం ఉండాలి తప్ప విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి పెత్తనం ఏమిటని అన్నారు. ప్రజల జీవితాలు మార్చేందుకు సూపర్‌ సిక్స్‌ పధకాలను తీసుకొచ్చానని చెప్పారు. అధికారంలోకి వస్తే తోటపల్లి కుడికాలువకు నిధులు మంజూరు చేసి సాగునీరు అందిస్తామని తెలిపారు. అధికారంలోనికి వచ్చిన వెంటనే మెగా డిఎస్‌సిపై మొదటి సంతకం, ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్టు రద్దుకు రెండో సంతకం పెడతానని తెలిపారు. మూతపడిన పరిశ్రమలు తెరిపించి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. గిరిజనుల కోసం 16 సంక్షేమ పథకాలు తీసుకొచ్చామని, వీటన్నింటినీ జగన తీసేసి గిరిజనులకు అన్యాయం చేసాడని, నవరత్నాల పథకాల పేర్లు పెట్టి నవ మోసాలకు గురి చేశారని విమర్శించారు. కురుపాం నియోజకవర్గంలో గుమ్మడిగెడ్డ రిజర్వాయర్‌, పూర్ణపాడు-లాబేసు వంతెన నిర్మాణం చేపడతామ హామీ ఇచ్చారు. ఇసుక దోపిడీతోపాటు అన్నింటిలోనూ అక్రమాలకు పాల్పడిన స్థానిక ఎమ్మెల్యే పుష్పశ్రీవానిని ఓడించాలని అన్నారు. సభల్లో చీపురుపల్లి అభ్యర్థి కిమిడి కళావెంకటరావు, విజయనగరం ఎంపి అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు, జిల్లా అధ్యక్షులు కిమిడి నాగార్జున, కురుపాంలో అరకు ఎంపి అభ్యర్థి కొత్తపల్లి గీత, అసెంబ్లీ అభ్యర్థి జగదీశ్వరి తదితరులు పాల్గొన్నారు.

➡️