ఇడి, సిబిఐ కేసుల్లో కవిత జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఇడి, సిబిఐ కేసుల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్‌ కస్టడీని రౌస్‌ అవెన్యూ కోర్టు జూన్‌ 3 వరకు పొడిగించింది. గతంలో విధించిన జ్యుడీషియల్‌ కస్టడీ సోమవారంతో ముగిసింది. దీంతో తీహార్‌ జైలు అధికారులు కవితను వర్చువల్‌ మోడ్‌లో కోర్టు ముందు ప్రవేశపెట్టారు. తొలుత సిబిఐ కేసులో కవిత జ్యుడీషియల్‌ కస్టడీపై విచారణ చేపట్టగా, ఆమె కస్టడీని పొడిగించాలని సిబిఐ తరపున న్యాయవాది పంకజ్‌ గుప్తా కోర్టును కోరారు. ఈ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకొన్న ధర్మాసనం, సిబిఐ కేసులో కవిత కస్టడీని పొడిగించింది. తరువాత ఇడి కేసులోనూ కవిత జ్యుడీషియల్‌ కస్టడీపై విచారణ జరిగింది. దర్యాప్తు కీలక దశలో ఉందని, కవిత కస్టడీ పొడిగించాలని ఇడి న్యాయవాది జోహెబ్‌ హుస్సేన్‌ కోర్టును కోరారు. అలాగే కవితతోపాటు మరో నలుగురిపై దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ వాదనలపై కవిత తరపున న్యాయవాది నితేశ్‌ రాణా అభ్యంతరం తెలిపారు. ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసిన తరువాత కస్టడీ అవసరం లేదని, కవితను విడుదల చేయాలని కోరారు. ఇరువైపులా వాదనలు విన్న స్పెషల్‌ జడ్జి, ఇడి కేసులోనూ కవిత జ్యుడీషియల్‌ కస్టడీని జూన్‌ 3 వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే సిబిఐ అక్రమంగా అరెస్టు చేసిందని, ఇడి, సిబిఐ కేసుల్లో బెయిల్‌ మంజూరు చేయాలని కవిత దాఖలు చేసిన పిటిషన్‌లపై ఈ నెల 24న ఢిల్లీ హైకోర్టు విచారణ జరపనుంది.

➡️