వంచకులను తదిమికొట్టాలి

వంచకులను తదిమికొట్టాలి

ప్రజాశక్తి-అనకాపల్లి ప్రతినిధి సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానమైన పోలింగ్‌ ప్రక్రియకు సోమవారంతో ముగింపు కానుంది.పోలింగ్‌కు, ఓట్ల లెక్కింపునకు మధ్య మూడు వారాల వ్యవధి వుండడంతో అభ్యర్ధులు తమ గెలుపోటములపై అంచనాలు, లెక్కలు వేసుకోవడమే మిగిలివుంది. జూన్‌ 4న ఓట్ల లెక్కింపుతో అభ్యర్థుల రాజకీయ భవితవ్యం తేలనుంది. అక్కడ నుంచే ప్రజల జీవితాలు ఎలా వుండబోతున్నాయో కూడా అర్ధం కానుంది.ప్రధాన రాజకీయ పార్టీలు వైసిపి, కూటమిలోనిటిడిపి, జనసేన, బిజెపి ఎన్నికల మ్యానిఫెస్టో చుట్టూ తిరిగాయే తప్ప, ప్రాంత ప్రజల తాత్కాలికమైన, లేదా సుదీర్ఘకాలంగా వున్న వాస్తవ సమస్యలేంటి? వాటి పరిష్కారానికి తమ ముందున్న మార్గాలేమిటి? వ్యవసాయ, పారిశ్రామికాభివృద్ధికి, యువత ఉపాధికి, విద్య, వైద్యం అందుబాటులోకి తీసుకురావడానికి, మౌలిక సదుపాయాల కల్పనకు తమ ముందున్న ఆలోచనలు, ప్రాధాన్యతలు ఏంటనేది చెప్పలేకపోయాయి.ఓటర్లను ప్రలోభపెట్టి గెలవాలన్న దిగజారుడుతనాన్ని ప్రదర్శించాయే తప్పితే, ప్రజల మనసు గెలిచి, విలువలను నిలబెట్టే పనికి ఆయా పార్టీలేవీ చేయలేదు. గెలిపిస్తే అభివృద్ధి చేస్తామని వంచించడమే గానీ, తన పదవీకాలంలో ఈ ప్రాంత అభివృద్ధికి ఫలానా పనిచేశానని ధైర్యంగా చెప్పుకొనేందుకు ఒక్క నమూనా కూడా చూపించుకోలేని, చెప్పలేని దుస్థితిలో వీరు తిరిగారు. ఈ తరహా అభ్యర్ధులు డబ్బులు వెదజల్లి, ఓటర్లను మత్తులో దించి, మైమరపించి గెలవాలన్న కుతంత్రాలకు వ్యూహాలు పన్నారు. పోలింగ్‌కు ఒక్కరోజే గడువున్న నేపథ్యంలో, ఇదే తమకు ఐదేళ్లపాటు భిక్ష పెడుతుంది గనుక బరితెగించి వ్యవహరిస్తున్నారు. పెట్టిన ఖర్చు, ఓటర్లకు పంచిన డబ్బుతో తమ విజయం ఆధారపడి వుందని నమ్మిన నయవంచకులు పోటీలో వున్నారు. డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేయడం, తరువాత సొమ్ము చేసుకొనేందుకు ఎన్నుకొనే ప్రజలపైనే స్వారీ చేయడం పాలక పార్టీలకు అలవాటైంది. ప్రజాస్వామిక విలువకు పట్టం కట్టే రోజు రాలేదని, రాదనుకొని డబ్బున్న వారంతా వ్యాపారాల నుంచి రాజకీయాల్లోకి ఎగబడుతున్నారు. మనిషి ముఖం చూసి గుర్తుపట్టలేని స్థానికేతరులు కూడా ఈ ధీమాతోనే ఈ ప్రాంతంపై వాలిపోతున్నారు. పలకరించేందుకు ఊర్లో మనిషి లేకపోయినా గెలుపు తనదేనంటూ విర్రవీగుతున్నారు. ఈ ప్రాంతానికి చెందిన, ఈ ప్రాంత ప్రజలకు దక్కాల్సిన, చెందాల్సిన వనరులను గెద్దల్లా తన్నుకుపోవడానికి పోటీపడుతున్నారు. ఆ పోటీదారులకు ప్రధాన పార్టీల స్థానిక పోటీదారులు తోడై అమాయాక ప్రజలను నిలువునా మోసగించ బూనుతున్నారు.రాష్ట్రానికి అన్యాయం చేసిన బిజెపికి సహకరిస్తూ వచ్చిన టిడిపి, జనసేన, బిజెపి కూటమి సహా వైసిపికి గుణపాఠం చెప్పాలి. 60 నెలల పాటు తమకు భయం, భీతి, నష్టం లేని, భారం వేయని సిపిఎం, సిపిఐ, వామపక్షాలతో కూడిన ఇండియా బ్లాక్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం ఈ ఎన్నికల్లో ఓటర్లుముందున్న తక్షణ ఆవశ్యకంగా కన్పిస్తోంది. ప్రత్యామ్నాయ విధానాలతో, అభివృద్ధి ప్రణాళికలతో, స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షించుకోవాలన్న సంకల్పంతో ప్రజాపోరాటాల అనుభవం కల్గిన ఇండియాఫోరం బలపర్చిన గాజువాక సిపిఎం అభ్యర్ధి మరడాన జగ్గునాయుడు, పశ్చిమ నియోజకవర్గ సిపిఐ అభ్యర్ధి అత్తిలి విమలను ఎన్నికల్లో ప్రజలు మనస్ఫూర్తిగా ఆదరించి గెలిపించాలి.. బలహీనపడుతున్న ప్రజాస్వామిక విలువలను బతికించాలి. ప్రజాస్వామిక విలువలకు తిలొదకాలిచ్చి, ప్రజలను వంచించే పార్టీలకు ఎన్నికల్లో రాజకీయ భిక్ష పెట్టకుండా, ఓడించి ప్రజా బోనులో నిలబెట్టాలి. ఓటుతో తరిమికొట్టాలి..

➡️