రోడ్లు రక్తసిక్తం

May 27,2024 23:24
  • వేర్వేరు ప్రమాదాల్లో8 మంది దుర్మరణం

ప్రజాశక్తి- రామచంద్రపురం (చంద్రగిరి), నెల్లూరు, గన్నవరం (కృష్ణా జిల్లా) : రాష్ట్రంలో సోమవారం రోడ్లు రక్తసిక్తం అయ్యాయి. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి చెందారు. వీరిలో మన రాష్ట్రానికి చెందిన నలుగురు, తమిళనాడుకు చెందిన నలుగురు ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం… నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం నరసారావుపురం గ్రామానికి చెందిన అడిగోపుల నీరజను ఆరోగ్యం బాగోలేకపోవడంతో చెన్నరులోని రాయవేలూరు సిఎంసి వైద్యశాలకు కారులో తీసుకెళ్తున్నారు. మార్గమధ్యంలో తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నాయుడుపేట-పూతలపట్టు జాతీయ రహదారిలో ఎం.కొంగరవారిపల్లి వద్ద కారు డ్రైవర్‌ నిద్రమత్తులో డివైడర్‌ మధ్యలోని కల్వర్టును ఢకొీట్టాడు. ఈ ప్రమాదంలో నెల్లూరు జిల్లా గంగపట్నం గ్రామానికి చెందిన కారు డ్రైవర్‌ షమీర్‌ బాషా (30), కారులో ప్రయాణిస్తున్న మనుబోలు మండలానికి చెందిన నీరజ తల్లి పద్మమ్మ (50), నరసాపురం గ్రామానికి చెందిన అడిగోపుల జయంతి (45), అడిగోపుల శేషయ్య (47) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. వారి మృతదేహాలను పోలీసులు అతికష్టంపై కారు నుంచి వెలికితీశారు. తీవ్రంగా గాయపడిన అడిగోపాల శ్రీనివాసులు, అడిగోపుల నీరజలను తిరుపతి రుయాస్పత్రికి తరలించారు. తమిళనాడుకు చెందిన స్వామినాథన్‌ (40) తన కుటుంబసభ్యులతో కలిసి తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నుండి తమ ఊరికి కారులో వెళ్తున్నారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడు వద్ద హెచ్‌పి పెట్రోల్‌ బంక్‌ సమీపంలో ఆ కారు అదుపు తప్పి డివైడర్‌ను, రోడ్డు అవతల ఎదురుగా వస్తున్న ఐరన్‌ లోడు లారీని ఢ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయింది. స్వామినాథన్‌, ఆయన పిల్లలు రాకేష్‌ (12), రాధప్రియ (14), సమీప బంధువు గోపి (23) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన స్వామినాథన్‌ భార్య సత్యను విజయవాడ ప్రభుత్వాస్పత్రికి పోలీసులు తరలించారు. కృష్ణా జిల్లా ఎస్‌పి ఆద్నాల్‌ హష్మీ, డిఎస్‌పి జైసూర్య సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణాలపై ఆరా తీశారు.

➡️