అక్రమ ఇసుక రవాణాపై చర్యలు తీసుకోవాలిప్రజలకు రక్షణ కల్పించాలి: సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు డిమాండ్‌

Feb 8,2024 22:07
అక్రమ ఇసుక రవాణాపై చర్యలు తీసుకోవాలిప్రజలకు రక్షణ కల్పించాలి: సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు డిమాండ్‌

ప్రజాశక్తి- చిత్తూరు డెస్క్‌: నగిరి మున్సిపాలిటీ పరిధిలో ఏకాంబర కుప్పం, ధరణి పంచాయతీలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుని, ప్రజలకు రక్షణ కల్పించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు డిమాండ్‌ చేశారు. నగరిలో గురువారం జరిగిన సిపిఎం సమావేశానికి షణ్ముగం అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు మాట్లాడుతూ నగిరి పరిధిలో రోజురోజుకి ఇసుక బకాసురుల ఆగడాలు ఎక్కువైపోతున్నాయని, వాటిని అరికట్టడంలో రెవెన్యూ యంత్రాంగం, పోలీసులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. రాత్రుల్లో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ పర్మిషన్‌ లేకపోయినప్పటికీ ఇష్టారాజ్యంగా ఇసుకను తరలిస్తున్నారని ఆరోపించారు. దీంతో చుట్టుపక్కల రైతాంగం ఉన్న బోర్లలో భూగర్భ అడుగంటి పోవడంతో నీళ్లులేక వ్యవసాయానికి ఇబ్బంది పడుతున్నారు. గ్రామస్తులు పదేపదే అడ్డుకున్నప్పటికీ వారిపై దౌర్జన్యాలకు దిగుతున్నారు. మంత్రి సొంత ఊర్లోనే ఇలా ఉంటే బయట ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అన్నారు. రాత్రులలో ట్రిప్పర్లతోనూ ట్రాక్టర్లతోనూ తమిళనాడుకు తరలిస్తూ లక్షల రూపాయలు గడుస్తున్నారని ఆరోపించారు. అదేవిధంగా నగిరి నియోజకవర్గంలో ఉన్న వేలాది మంది పవర్‌ లూం కార్మికులకు గతంలో స్వయంగా ముఖ్యమంత్రి నగరిలో సమావేశంలో విద్యుత్తు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చినా ఇంతవరకు అమలు కాలేదని వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. గత పోరాట సందర్భంగా కుదిరించుకున్న అగ్రిమెంటు ప్రకారం కూలిరేట్లు కూడా అమలు చేయలేదని లేబర్‌ అధికారులు రెవెన్యూ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వహిస్తున్నారని, జిల్లా కలెక్టర్‌ వెంటనే స్పందించి సమస్యను పరిష్కారం చేయాలని డిమాండ్‌ చేశారు. ఇదే కాకుండా నియోజకవర్గంలో ప్రజాసమస్యలపై సిపిఎం నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో సిపిఎం నగిరి కార్యదర్శి పెరుమాళ్‌, నాయకులు మైల్‌ స్వామి, తంగరాజు తదితరులు పాల్గొన్నారు.

➡️