అబ్బురపరిచిన బాల గణిత అవధానం

Dec 20,2023 22:30

ప్రజాశక్తి -గంగాధర నెల్లూరు: మండలంలోని పెడగంటిపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న కేకే.లువంతి, టి.దిషితలు అవధానులుగా వ్యవహరించి పలువురు అడిగిన ప్రశ్నలకు అవలీలగా సమాధానాలు చెప్పి అందరిని అబ్బురపరిచారు. జనవిజ్ఞాన వేదిక, ఆంధ్రప్రదేశ్‌ మ్యాథ్స్‌ ఫోరమ్‌ సంయుక్త ఆధ్వర్యంలో మెంటరుగా వ్యవహరించిన హెచ్‌.అరుణ శివప్రసాద్‌ మాట్లాడుతూ విద్యార్థులలో అంతర్గతంగా దాగి ఉన్న గణిత శక్తులను వెలికి తీసేందుకు అవగాహన కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. పాపుదేసి ఫౌండేషన్‌ వారి ఆర్థిక సహాయంతో జాతీయ గణిత దినోత్సవంలో భాగంగా ఎంఈఓ గుణశేఖర్‌ మాట్లాడుతూ మండలంలో మొదటిసారి ఈఅవధాన కార్యక్రమం జరుగుచున్నదని, ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు గణితంపై భయాన్ని పోగొట్టవచ్చని తెలిపారు. 8 అంశాలు అయినా మనః సంకలనము, వంద వరకు ఎక్కములు, వర్గాలు, వింతచదరాలు, ఘన మూలాలు, వార గణన, రామానుజన్‌ సంఖ్యగా గల వర్గాలు, పెద్ద సంఖ్యలకు ఘన మూలాలను తెలిపారు. ఈకార్యక్రమానికి విచ్చేసిన గణిత టీచర్లను దేశి ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు జయంతి సత్కరించారు. జిల్లా గణిత ఫోరం ప్రధాన కార్యదర్శి చంద్రమ నాయుడు, మ్యాథ్స్‌ టీచర్లు హంస, సరళ, భాస్కర్‌ రెడ్డి, హైమావతి, శేషగిరిరావు, జవహర్‌ రెడ్డి, శ్రీధర్‌ పాల్గొన్నారు.

➡️