ఎన్నికల విధులకు సమాయత్తం కావాలి – ఎస్‌పి పి జాషువా

ఎన్నికల విధులకు సమాయత్తం కావాలి - ఎస్‌పి పి జాషువా

ఎన్నికల విధులకు సమాయత్తం కావాలి – ఎస్‌పి పి జాషువాప్రజాశక్తి -చిత్తూరు అర్బన్‌: ఎన్నికల విధులకు అధికారులు సమాయత్తం కావాలని ఎస్‌పి పి జాషువా సూచించారు. జిల్లా ఎస్‌పిగా పి జాషువా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లాలోని పోలీసు అధికారులతో పోలీస్‌ గెస్ట్‌ హౌస్‌ కాన్ఫరెన్స్‌ హాలులో ఆదివారం పరిచయ సమావేశం నిర్వహించారు. జిల్లా లోని సబ్‌ డివిజన్‌ వారిగా అధికారులు ఎస్పీని పరిచయం చేసుకున్నారు. అనంతరం అడిషనల్‌ ఎస్పీ అడ్మిన్‌ అరిఫుల్లా మాట్లాడుతూ పట్టుదల కల అధికారి మన జిల్లాకు రావడం మన అదష్టం అన్నారు. ఈ సందర్భంగా అధికారులతో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ చిత్తూరు జిల్లా పలమనేరు సబ్‌-డివిజన్‌కు డిఎస్పీ గా పని చేసి మళ్లీ 12 సంవత్సరాల తరువాత ఇదే చిత్తూరు జిల్లాకు ఎస్పీ గా రావడం చాలా సంతోషంగా వుందన్నారు. ఖాకీ యూనిఫాం ధరించిన మనమందరం ఒకే కుటుంబం అని కుల, మత విబేధాలు లేకుండా మనమందరిని ఒకటి చేస్తుందని, అదే విధంగా ప్రజలు వారికి కష్టమని పోలీస్‌ స్టేషన్‌ కు వచ్చినప్పుడు వారిని మన కుటుంబ సభ్యుల వలే భావించి వారికి న్యాయం జరిగేల కుల మతాలకు, రాజకీయాలకు అతీతంగా మనం ఉద్యోగ ధర్మం నిర్వర్తిస్తూ ఫ్రెండ్లీ పోలీసింగ్‌లా వ్యవహరించాలన్నారు. వచ్చే ఎన్నికలపై మనం ప్రత్యేక దష్టి సారించాలని, అందుకు ఇప్పటి నుండే ప్రణాళికలు సిద్ధం చేసుకొని ప్రణాళిక బద్ధంగా పని చేసి ఎన్నికలు సజావుగా సాగేలా చూసుకోవాలన్నారు. ఎన్నికల సమయంలో రూట్‌ మొబైల్స్‌ కీలక పాత్ర పోషిస్తాయన్నారు. మన జిల్లా రెండు రాష్ట్రాలకు బోర్డర్‌ కావడంతో అక్రమ మద్యం, డబ్బు రవాణ ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నందున బోర్డర్‌ చెక్‌ పోస్ట్‌లు మరింత బలోపేతం చేయాలన్నారు. అక్రమ రవాణ చేస్తున్న వారినే కాకుండా వారిపై ఉన్నవారిని(కింగ్‌ పిన్స్‌) గుర్తించి వారిని అరెస్ట్‌ చేసినప్పుడే అక్రమ రవాణకు అడ్డుకట్ట వేయగలమన్నారు. ఎన్నికల సమయంలో లా అండ్‌ ఆర్డర్‌ చాలా సున్నితంగా ఉంటుంది. అందరం ఎల్లప్పుడూ అప్రమత్తతతో ఉంటూ ఏదైనా సంఘటన జరిగినపుడు సరైన సమయంలో సంఘటనా స్థలానికి చేరుకునే విధంగా ఉండాలన్నారు. నైట్‌ బీట్‌ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని రాత్రి సమయాలలో కూడా వాహనాలు తనిఖీ చేయాలని సూచించారు. ఉద్యోగంలో ఎవరైనా అలసత్వం వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఫలితాల సాధనకు కృషి ఉత్తమ మార్గం అని క్రమశిక్షణ, సమయపాలన, స్థిరత్వం యూనిఫాం వేసుకున్న పోలీసులకు అందం అని ఈ సందర్భంగా ఎస్‌పి తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్‌ ఎస్పీ అడ్మిన్‌ ఆరిఫుల్లా, అడిషనల్‌ ఎస్పీ సెబ్‌ ఎవి సుబ్బరాజు, సబ్‌-డివిజన్‌ డిఎస్పీ లు, జిల్లా లోని డిఎస్పీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎపైలు పాల్గొన్నారు.

➡️