గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చట్ట రీత్యానేరం

Dec 19,2023 21:35

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరమని, ఉల్లంఘించిన వారిపై క్రిమినల్‌ చర్యలు చేపట్టడం జరుగుతుందనని జిల్లా లీగల్‌ సర్విస్‌ అథారిటీ సెక్రెటరీ, సీనియర్‌ సివిల్‌ జడ్జి ఐ.కరుణకుమార్‌ తెలిపారు. మంగళవారం డిఆర్‌డిఏ సమావేశ మందిరంలో పిసి అండ్‌ పిఎన్‌డిటి చట్టం, స్త్రీల హక్కులపై జిల్లాస్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డిఎం అండ్‌ హెచ్‌ఓ డాక్టర్‌ ప్రభావతీ దేవి, డిఆర్డిఏ పిడి తులసి, బిసి, సాంఘీక సంక్షేమ శాఖల అధికారులు రబ్బాని బాషా, రాజ్యలక్ష్మీ, డిఐఓ డాక్టర్‌ రవిరాజు, దిశ ఎస్‌ఐ నాగసౌజన్య, స్వయం సహాయ సంఘాల మహిళలు, వైద్య సంబంధిత శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా లీగల్‌ సర్విస్‌ అథారిటీ సెక్రెటరీ, సీనియర్‌ సివిల్‌ జడ్జి ఐ.కరుణకుమార్‌లి మాట్లాడుతూ గర్భస్థ పిండ లింగనిర్ధారణ పరీక్షలు చేయడం చట్ట రీత్యా నేరమని, ఉల్లంఘించిన వారిపై క్రిమినల్‌ చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. చట్టాలను ఉల్లంఘిస్తే మొదటిసారి మూడు సంవత్సరాలు జైలు శిక్ష, రూ.10 వేలు జరిమానా, రెండవసారి నేరం చేస్తే 5 సంవత్సరాలు జైలు శిక్ష, రూ.50వేలు జరిమానా విధించడడం జరుగుతుందన్నారు. డిఎంఅండ్‌ హెచ్‌ఓ డాక్టర్‌ ప్రభావతీ దేవి మాట్లాడుతూ సమాజంలో స్త్రీలుగా ఆడ బిడ్డలను రక్షించాల్సిన బాధ్యత ఉందన్నారు. ఆడపిల్లలకు మంచి చదువును అందిస్తే వారు సమాజంలో అన్ని రంగాలలో రాణిస్తారని తెలిపారు. డిఆర్‌డిఏ పీడీ తులసి మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల మహిళలు వారు నివాసముంటున్న ప్రాంతాలలో గర్భస్థ లింగపిండ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వారి దృష్టికి వస్తే జెండర్‌ కమిటీ దృష్టికి తీసుకురావాలని కోరారు.

➡️