జగనన్న పాలవెల్లువ ప్రారంభం

Dec 20,2023 22:28

ప్రజాశక్తి- గంగవరం: మండలంలోని కల్లుపల్లి సచివాలయం, కలగటూరు సచివాలయంలో సుమారు రూ.36లక్షల వ్యయంతో ‘జగనన్న పాలవెల్లువ’ కేంద్రాలు బుధవారం ఎమ్మెల్యే వెంకటే గౌడ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాడి రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తూ జగనన్న పాల వెల్లువ పథకం కింద అమూల్‌తో ఒప్పందం వల్ల లీటర్‌ పాలకు రూ.20ల వరకు అదనంగా ఆదాయం అందిస్తోందన్నారు. మధ్య దళారీలు, కమీషన్‌ ఏజెంట్లకు స్వస్తి పలుకుతూ ప్రతి 10 రోజులకు ఒకసారి అక్కచెల్లెమ్మల బ్యాంకు ఖాతాలకు నేరుగా నగదు జమ చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ వెంకటరమణ, జడ్పిటిసి చంద్రమ్మ, సర్పంచ్‌, పాడిరైతులు పాల్గొన్నారు. అనంతరం గంగవరం సచివాలయం-1లో ఆరోగ్యశ్రీ స్మార్ట్‌ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలకు మెరుగైన ఆరోగ్యం అందించేందుకు సీఎం జగనన్న ఎన్నో విప్లవాత్మక మార్పులు, సంస్కరణలను వైద్య ఆరోగ్యశాఖలో తీసుకొచ్చారని ఎమ్మెల్యే అన్నారు. రాష్ట్ర ప్రజలకు ఇకపై రూ.25లక్షల విలువైన వైద్యాన్ని పూర్తి ఉచితంగా అందించేలా చర్యలు తీసుకోవడం ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించారని కొనియాడారు.

➡️