జగన్‌ సర్కారుకు నిరసన సెగలు

Dec 16,2023 22:40
జగన్‌ సర్కారుకు నిరసన సెగలు

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: అధికారంలోకి రాక ముందు పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు కోసం అంగన్వాడీలు, ఆశా వర్కర్ల ఆందోళనలు చేపట్టారు. అలాగే తుపాను కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ రైతు సంఘాలు, రైతులు, కార్మిక చట్టం ప్రకారం బకాయి వేతనాలు చెల్లించాలంటూ విజయ డెయిరీ కార్మికుల ఆందోళనలతో జగన్‌ ప్రభుతానికి నిరసన సెగలు తాకుతున్నాయి. పాదయాత్ర సందర్భంగా అంగన్వాడీలకు పక్క రాష్ట్రాల కంటే వెయ్యి రూపాయలు అదనంగా జీతం పెంచుతామని, ఆశా వర్కర్లకు జీతాలు పెంచుతామని బహిరంగ సభల్లో ప్రకటించారు. అధికారంలోకి వచ్చి నాలుగన్న సంవత్సరం అవుతున్నా తమ సమస్యలపై ఎలాంటి స్పష్టతా ఇవ్వకపోవడంతో అంగన్వాడీలు విధిలేని పరిస్థితుల్లో 14 రోజులకు ముందే సమ్మెనోటీ ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ యూనియన్లు సమ్మెకు పూనుకుంటే సమయం అడిగాం ఇంతలో సమ్మెకు పూనుకున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తోంది. ప్రభుత్వం సమ్మె నోటీసు ఇచ్చినా తుపాను కారణంగా వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే. సమ్మెకు ముందు ప్రభుత్వ కార్యదర్శి ఐసిడిఎస్‌ మంత్రితో చర్చలు జరిపినా పట్టించుకోలేదు. బడ్జెట్‌ పేరుతో జీతాల పెంపుపై స్పష్టమైన హామీ ఇవ్వాకపోగా అంగన్వాడీ యూనియన్లపై తప్పుడు ప్రచారం చేస్తోంది. చట్టపరమైన అంగన్వాడీ సమ్మెను నీరుగార్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. ప్రభుత్వ ఆస్తి అంగన్వాడీ సెంటర్లను ప్రభుత్వ అధికారులతో చట్టవిర్ధుంగా తాళాలు పగలగొట్టి చట్టదిక్కరణకు పాల్పడుతోంది. ఇదేమిటని ప్రశ్నిస్తున్న అంగన్వాడీలను బెదిరింపులకు గురిచేస్తోంది. ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా మొక్కవోని సంకల్పంతో రాష్ట్రవ్యాప్తంగా లక్షా 10వేల మంది అంగన్వాడీ కార్యకర్తలు, ఆయమ్మలు సమ్మెను కొనసాగిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో వందశాతం అంగన్వాడీలు సమ్మెలో ఉన్నారు. సమ్మె ప్రారంభమైన ఐదు రోజులు గడుస్తున్నా అంగన్వాడీలు ఏమాత్రం తగ్గడం లేదు. మరోవైపు ఆశా వర్కర్ల సమస్యలపై జిల్లా కలెక్టరేట్‌ ఎదుట వందలాది మంది ఆశాలు 36 గంటలు దీక్షలు నిర్వహించారు. వంటవార్పుతో నిరసన వ్యక్తం చేశారు. తమపాత బకాయిలు చెల్లించాలంటూ సహకార విజయడెయిరీ కార్మికులు కలెక్టరేట్‌ ఎదుట చేపట్టిన రిలేదీక్షలు 95 రోజులుగా కొనసాగుతోంది. తుపాను కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ జిల్లాలో పర్యటిస్తున్న కేంద్రబృందాని రైతులు ప్రశ్నిస్తున్నారు. తుపాను ప్రభావంతో నష్టపోయిన పంట పొలాలను, పంటను చూపుతున్నారు. న్యాయమైన సమస్యల సాధన కోసం అంగన్వాడీలు చేపట్టిన సమ్మెకు రాజకీయ పార్టీలు, ట్రేడ్‌ యూనియన్లు, ఉపాధ్యాయ సంఘాలు, ప్రజాసంఘాల నుండీ పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది.

➡️