నగరపాలక సంస్థ బడ్జెట్‌ అంచనా రూ.274.93 కోట్లు

Feb 21,2024 21:37
నగరపాలక సంస్థ బడ్జెట్‌ అంచనా రూ.274.93 కోట్లు

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: చిత్తూరు నగరపాలక సంస్థ 2024-25 సంవత్సరం బడ్జెట్‌ అంచనాలను రూ.274.93 కోట్లతో రూపొందించినట్లు నగర మేయర్‌ ఎస్‌.అముద చెప్పారు. నగరపాలక సంస్థ కౌన్సిల్‌ బడ్జెట్‌ సమావేశం బుధవారం ఉదయం నగరపాలక సమావేశ మందిరంలో మేయర్‌ ఎస్‌.అముద అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూపొందించిన బడ్జెట్‌ అంచనాలను కౌన్సిల్‌ ఆమోదించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో నగరపాలక సంస్థకు సాధారణ, మూలధన జమల ద్వారా రూ.274,93,45,236.00 వస్తుండగా, రూ. 265,36,67,946.00 సాధారణ మూలధనం వ్యయంగా అంచనా వేశారు. నగరపాలక కౌన్సిల్‌ సాధారణ సమావేశం బుధవారం మధ్యాహ్నం నగర మేయర్‌ అముద అధ్యక్షతన జరిగింది. సహాయ కమిషనర్‌ గోవర్థన్‌, వార్డు కార్పొరేటర్లు, కో ఆప్షన్‌ సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ నగర అభివద్ధి కోసం సభ్యులంతా కలిసికట్టుగా పనిచేయాలన్నారు. రానున్న వేసవి దష్ట్యా నగరంలో నీటి ఎద్దడి తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టాలని, వీధిలైట్లు, డ్రైనేజీలో శుభ్రత, దోమల నియంత్రణ వంటి చర్యల కోసం యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించి చర్యలు తీసుకోవాలన్నారు. అజెండా అంశాలపై సభ్యులు చర్చించారు. గిరింపేట మున్సిపల్‌ పార్కు స్థలంలో స్వతంత్ర సమరయోధులైన మరుదూరు బ్రదర్స్‌ అయిన పెరియమరుదు, చిన్నమరుదు విగ్రహాల ప్రతిష్టకు, ఈ పార్కుకు మరుదూరు బ్రదర్స్‌ అయిన పెరియమరుదు, చిన్నమరుదు పేరును పెట్టడానికి కౌన్సిల్‌ ఆమోదించింది. చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో పీవీకేఎన్‌ కాలేజ్‌ నుండి అంబేద్కర్‌ భవన్‌ వరకు రోడ్డును కేబీఆర్‌ మ్యాంగో భవన్‌ రోడ్డుగా, కట్టమంచి నుండి సాంబయ్య కండిగ వరకు ఉన్న రోడ్డును డాక్టర్‌ సీఆర్‌ రెడ్డి బైపాస్‌ రోడ్డుగా నామకరణం చేయడానికి, నగరపాలక పరిధిలోని చెరువువీధిని పొన్నుస్వామి నాయకర్‌ వీధిగా పేరు మార్చడానికి ఆమోదించారు. నగరపాలక సంస్థకు సంబంధించి కూరగాయల మార్కెట్లు, జంతు వథశాల, ఎన్టీఆర్‌ బస్టాండ్‌, కాసు బ్రహ్మానందరెడ్డి బస్టాండ్లకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం నియమనిబంధనల ప్రకారం బహిరంగ వేలం నిర్వహించడానికి, అక్రిడేటెడ్‌ జర్నలిస్టుల ఇంటి స్థలాలకు సంబంధించి ఇరువారం గ్రామ రెవెన్యూలో గుర్తించిన భూమి భూసర్వే తహశీల్దార్‌ వారిచే మార్చుటకు కౌన్సిల్‌ ఆమోదించింది. అజెండాలోని ఇతర అంశాలపైన కౌన్సిల్లో సభ్యులు చర్చించారు. ఈనెల 29న ఉద్యోగ విరమణ చేయనున్న సహాయ కమిషనర్‌ గోవర్థన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. సమావేశంలో డిప్యూటీ మేయర్లు ఆర్‌.చంద్రశేఖర్‌, రాజేష్‌ కుమార్‌రెడ్డి, ఎంఈ గోమతి, మేనేజర్‌ ఉమామహేశ్వర్‌ రెడ్డి, సీఎంఎం గోపి, ఏసిపీ రామకష్ణుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

➡️