పాత పెన్షన్‌ ఇచ్చే వారికే ఓట్లు..యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌ వెంకటేశ్వర్లు

పాత పెన్షన్‌ ఇచ్చే వారికే ఓట్లు..యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌ వెంకటేశ్వర్లు

పాత పెన్షన్‌ ఇచ్చే వారికే ఓట్లు..యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌ వెంకటేశ్వర్లు ప్రజాశక్తి -చిత్తూరు అర్బన్‌: సిపిఎస్‌, జిపిఎస్‌ విధానాలు కార్పొరేట్‌లకు లాభాలు వచ్చే విధానాలు మాత్రమే నని, పాత పెన్షన్‌ మాత్రమే ఉద్యోగ ఉపాధ్యాయుల, ప్రజలకు లాభం అని, పాత పెన్షన్‌ ఇచ్చే పార్టీలకే ఓట్లు వేయాలని యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌ వెంకటేశ్వర్లు పిలుపు నిచ్చారు. చిత్తూరు జిల్లా యూటీఎఫ్‌ ముఖ్య కార్యకర్తల సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయిన ఎన్‌ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జనవరి 28వ తేదీ రాజమండ్రిలో వేలాది మందితో ‘ఓట్‌ ఫర్‌ ఓపిఎస్‌’ నినాదంతో సదస్సు నిర్వహించారని తెలిపారు. ఈ సదస్సుకి సీపీఎం, సీపీఐ, ఆమాద్మీ, బిఎస్పీ మాత్రమే హాజరై పాత పెన్షన్‌ మేనిఫెస్టోలో పెడతామని చెప్పారని, వారందరికీ అభినందనలు తెలుపుతున్నామన్నారు. మిగిలిన పార్టీలు ఇంతవరకు వారి వైఖరి స్పష్టం చేయకపోవడం సరి కాదని తెలిపారు. సీపీఎస్‌, జిపిఎస్‌ విధానంలో ఎన్‌ఎస్డిఎల్‌లో సొమ్ముని కుదవ పెట్టడం ద్వారా ఉపాధ్యాయులకు ఎలా లాభం వస్తుందో ప్రభుత్వాలు చెప్పాలని డిమాండు చేశారు. గతంలో పిఎఫ్‌ఆర్డిఏ చట్టాన్ని తీసుకొచ్చిన కాంగ్రెస్‌, మిగిలిన రాజకీయ పార్టీలు రాష్ట్రాల్లో ప్రజా పోరాట ఫలితంగా నేడు ఓపిఎస్‌ విధానం తిరిగి వస్తోందని తెలిపారు. ప్రజా పోరాటాలకు , ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన చేసేందుకు పార్టీలు సిద్ధం కావాలని సూచించారు. కార్పొరేట్‌ల లాభాల కోసం సష్టించిన సిపిఎస్‌ విధానాన్ని పూర్తి స్థాయిలో రద్దు చేయాలని డిమాండు చేశారు. యుటిఎఫ్‌ పిలుపును ఉపాధ్యాయులు, ఉద్యోగుల్లో ప్రజల్లో ప్రచారం చేయాలని కోరారు. రాష్ట్రంలో 14 వేలకు పైగా ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయని, ఈ పాఠశాలలు భవిష్యత్తులో కొనసాగించుకోవడం కష్టమైన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఈ పాఠశాలలలో మరొక ఉపాధ్యాయుడిని నియమించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అత్యంత తక్కువ మంది ఉపాధ్యాయులకు నోటిఫికేషన్‌ ఇవ్వటం సరికాదన్నారు. ఇప్పటికైనా పున: పరిశీలించి ఎన్ని ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయో? ఒక స్పష్టమైన గణాంకాలను విడుదల చేయాలని కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు ఏపీజేఏసీ ఆధ్వర్యంలో ప్రభుత్వం వద్ద ఉంచిన డిమాండ్స్‌, ఆర్థిక బకాయిలు చెల్లించాలని, 2023 నుంచి ఐఅర్‌30 శాతం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ దశలవారీ పోరాటానికి పిలుపు నిచ్చినా ప్రభుత్వం స్పందించ లేదని, వెంటనే ప్రభుత్వం స్పందించి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి జీవి రమణ మాట్లాడుతూ 14 సంవత్సరాలు పోరాటం చేసి వెట్టి చాకిరీ విధానమైన అప్రెంటిస్‌ విధానాన్ని రద్దు చేయించుకున్నామని, మళ్లీ ఇప్పుడు 2024 డిఎస్సిలో తిరిగి అప్రెంటిస్‌ విధానం ప్రవేశపెట్టడం సరికాదన్నారు. అప్రెంటిస్‌ విధానం లేని పూర్తి స్థాయి వేతనంతో కూడిన డిఎస్‌సిని పాటించాలని కోరారు. యుటిఎఫ్‌ చిత్తూరు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎంసోమశేఖర్‌ నాయుడు, ఎన్‌మణిగండన్‌ మాట్లాడుతూ గడిచిన రెండు సంవత్సరాలుగా ఎన్నో పోరాటాలు చేసి కొన్ని సమస్యలు పరిష్కరించుకున్నామని, భవిష్యత్తులో పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కరించుకుంటామని, అందరూ యూటీఎఫ్‌ చేసే పోరాటాలకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు పి సుధాకర్‌ రెడ్డి, సహాధ్యక్షులు పి ఆర్‌ మునిరత్నం , ఎస్‌ రెహానా బేగం, నాయకులు రెడ్డెప్ప నాయుడు, దీనావతి, ఎస్‌ పి బాషా, ఏకాంబరం, సరిత, పార్థసారథి, ఎం వి రమణ, వంశీ కష్ణ , మునికష్ణయ్య, రాజేంద్ర, చంద్ర, నాగరాజ, తదితరులు పాల్గొన్నారు.

➡️