పారిశుధ్య పనులు తనిఖీ

Dec 28,2023 22:18

ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌:పురపాలకశాఖ పరిధిలో ఔట్సోర్సింగ్‌ కార్మికుల సమ్మె పిలుపు నేపథ్యంలో నగరపాలక పరిధిలో పారిశుద్ధ్య పనుల నిర్వహణకు ఎలాంటి ఆటకం లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దష్టి పెట్టాలని కమిషనర్‌ డాక్టర్‌ జె.అరుణ ప్రజారోగ్య విభాగం అధికారులను, పారిశుద్ధ్య పర్యావరణ కార్యదర్శులను ఆదేశించారు. గురువారం ఉదయం నగరపాలక కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి మార్గనిర్దేశం చేశారు. కమిషనర్‌ మాట్లాడుతూ ప్రధాన రహదారుల్లో స్వీపింగ్‌ పనులకు, క్షేత్రస్థాయిలో చెత్త సేకరణకు ఎలాంటి ఆటంకం లేకుండా ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. అధిక మొత్తంలో వ్యర్ధాల సేకరణకు సంబంధించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలన్నారు. అవసరమైతే డ్వాక్రా మహిళల సాయం తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో సహాయ కమిషనర్‌ గోవర్థన్‌, ఎంహెచ్వో డాక్టర్‌ లోకేష్‌, శానిటరీ ఇన్స్పెక్టర్లు చిన్నయ్య, నరసింహ, లోకనాథం, పారిశుద్ధ్య పర్యావరణ కార్యదర్శులు, మేస్త్రిలు పాల్గొన్నారు.
నగరంలోని కట్టమంచి చెరువుకట్ట, కూరగాయల మార్కెట్‌ ప్రాంతాలను నగర కమిషనర్‌ గురువారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కట్టమంచి చెరువు కట్టపై వాకింగ్‌ ట్రాక్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలన్నారు. వాకింగ్‌ చేసే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎప్పటికప్పుడు పనులు చేపట్టాలని ప్రజారోగ్య విభాగం అధికారులను ఆదేశించారు. క్రమం తప్పకుండా గ్యాంగ్‌ వర్కులు నిర్వహించి చెరువుకట్టపై పిచ్చి మొక్కలను తొలగించాలన్నారు. పనులు చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడారు. అనంతరం కూరగాయల మార్కెట్‌ ప్రాంతాన్ని పరిశీలించారు. మార్కెట్‌లో రోజూ ఉదయం శుభ్రం చేయాలని, వ్యర్ధాలను ఇష్టారాజ్యంగా పడేయకుండా వ్యాపారస్తులకు అవగాహన కల్పించాలన్నారు. మార్కెట్‌ను శుభ్రంగా ఉంచుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. పారిశుధ్య పనులు తనిఖీ చేస్తున్న నగర కమిషనర్‌ అరుణ

➡️