పెన్షన్‌ టెన్షన్‌…

Apr 2,2024 21:51
పెన్షన్‌ టెన్షన్‌...

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌ సామాజిక పింఛన్లు ఎన్నికలవేల వేడి రాజేస్తున్నాయి.. ఓ వైపు ప్రతిపక్ష టిడిపి పింఛన్లు పంపిణీ చేయకుండా అడ్డుకుంటోందని అధికారపార్టీ ఆరోపిస్తుంటే.. మరోవైపు డబ్బులు దారిమళ్లించడం వల్ల ఖజానా ఖాళీ అయ్యి పింఛన్ల పంపిణీ ఆలస్యమౌతోందని, ఇది అధికారపార్టీ తప్పే అని టిడిపి అంటోంది.. ఎన్నికల సమయంలో సామాజిక పింఛన్ల పంపిణీ అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పెద్దచిచ్చునే రాజేసింది. ఇదిలా ఉండగా ప్రతినెలా ఒకటో తేదీన పింఛన్లు తీసుకునే అవ్వాతాలు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు అసలు ఈనెల పింఛన్‌ వస్తుందా లేదా అని టెన్షన్‌ మొదలైంది. వైసిపి ఏర్పాటు చేసిన వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేస్తూ అధికారపార్టీ వారికే ఓటు వేసేలా ప్రచారం నిర్వహించడంతో పాటు పింఛన్లు రావడానికి జగనన్న ముఖ్యకారణమని రెండోసారి వైసిపి ప్రభుత్వం అధికారంలోకి రాకుంటే వారికి పింఛన్లు అందే పరిస్థితు ఉండదంటూ ప్రచారం చేస్తోందని అనుమానాలతో తెలుగుదేశం పార్టీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో పింఛన్ల పంపిణీ ఆలస్యమౌతోంది. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం అందిస్తున్న వివిధ రకాల సామాజిక పింఛన్లు 2,74,000లు వున్నాయి. ప్రతి నెలా 612 గ్రామ, వార్డు సచివాల సిబ్బంది 8,800 మంది ప్రతి ఇంటికీ వెళ్ళి పింఛన్లు అందస్తున్నారు. నేటి నుంచి పింఛన్ల పంపిణీ పింఛన్ల పంపిణీలో నెలకొన్న సమస్యలను తొలగిస్తూ ఈనెల 3వ తేదీ నుంచి సామాజిక పింఛన్లు పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం పూనుకుంటోంది. నేటి నుంచి జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయల్లో పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ఈ పంపిణీలో సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారించేలా జిల్లా కేంద్రంలోని డిఆర్‌డిఎ కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ను అధికారులు ఏర్పాటు చేశారు. గ్రామ, సచివాలయ కార్యదర్శులు వారి పరిధిలోని ఫించన్లు పంపిణీ కోసం నగదు బ్యాంకు నుండీ డ్రా చేయాల్సి ఉంటుంది. గ్రామ, వార్డు సచివాయాల్లో కౌంటర్లు ఏర్పాటు చేసి ఫించన్‌ పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ బుధవారం నుండీ ఈనెల 6వ తేదిలోపు పూర్తి చేయాలి. ఆ తరువాత సచివాలయాల వద్దకు రాలేని ఫించనుదార్లకు ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేయనున్నారు. ఆధార్‌ కార్డు, పింఛన్‌ కార్డు, ఓటిపిల ద్వారా పంపిణీ చేయాల్సి ఉంటుంది. సాయంత్రానికి కళ్లా మిగిలిన నగదు ఇతర వివరాలను సచివాలయ కార్యదర్శులు ఆన్‌లైన్‌లో ఎంపీడీవోలకు తెలియజేయాల్సి ఉంటుంది.

➡️