పోలింగ్‌ సరళిపై 25న మాక్‌ పోల్‌ నిర్వహణ

Jan 2,2024 22:59
పోలింగ్‌ సరళిపై 25న మాక్‌ పోల్‌ నిర్వహణ

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: పోలింగ్‌ సరళిపై అవగాహన నిమిత్తం పాఠశాల, కళాశాల విద్యార్థులకు ఈనెల 25న మాక్‌పోల్‌ నిర్వహణ చేపట్టాలని విద్యాశాఖ, ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ అధికారులను జిల్లా కలెక్టర్‌ ఎస్‌.షన్మోహన్‌ ఆదేశించారు. మంగళవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో జిల్లా కలెక్టర్‌ స్వీప్‌ యాక్టివిటీస్‌ నిమిత్తం వివిధ శాఖల వారీగా చేపట్టవలసిన కార్యక్రమాల నిమిత్తం సంబంధిత అధికారులతో సమావేశమై సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి పోలింగ్‌ స్టేషన్‌వారీగా స్వీప్‌ ఆక్టివిటీస్‌ను బిఎల్‌ఓ నిర్వహించాలన్నారు. ఓటుహక్కు నమోదు ప్రక్రియ, ఓటర్లుగా ఉన్నవారు తమ ఓటుహక్కును వినియోగించుకునేలా అవగాహన పెంచాలన్నారు. ఈకార్యక్రమంలో భాగంగా మరణించిన వారి పేర్లను తొలగించే విషయంపై సంబంధిత పంచాయతీ సెక్రటరీలతో సమన్వయం చేసుకొని ఈ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ఆశా, స్వయం సహాయక సంఘాల మహిళలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావడం ద్వారా ఓటు హక్కు వినియోగంపై పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పోలింగ్‌ స్టేషన్లో వారీగా అక్షరాస్యత తక్కువగా ఉన్న చోట కూడా ఓటర్లు గా వున్న వారు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు చర్యలు చేపట్టాలన్నారు. దీనితోపాటు ఎన్నికల పోలింగ్‌ సరళిపై అవగాహన నిమిత్తం పాఠశాల, కళాశాల విద్యార్థులకు ఈనెల 25న మాక్‌ పోల్‌ నిర్వహించేలా చర్యలు చేపట్టాలని విద్యాశాఖ, ఇంటర్మీడియట్‌ అధికారులు డీఈఓ విజయేంద్ర రావు, డివిఈఓ సయ్యద్‌ మౌలాలను కలెక్టర్‌ ఆదేశించారు. కళాశాల స్థాయిలో ఎలెక్టోరల్‌ లిటరసీ క్లబ్బులు ఏర్పాటు ద్వారా యువఓటర్ల నమోదు ప్రక్రియ, ఓటుహక్కు వినియోగంపై అవగాహన పెంచాలన్నారు. స్వీప్‌ ఆక్టివిటీస్‌లో భాగంగా శాఖల వారీగా డ్వామా, ఐసిడిఎస్‌, డీఈఓ, జడ్పీ సీఈఓ, మున్సిపల్‌ కమిషనర్లు వారు చేయబోయే కార్యక్రమాలకు సంబంధించి ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ పి. శ్రీనివాసులు, డిఆర్‌ఓ ఎన్‌. రాజశేఖర్‌, జడ్పీ సీఈఓ ప్రభాకర్‌రెడ్డి, డ్వామా, మెప్మా పీడీలు గంగాభవాని, రాధమ్మ, డిపిఓ లక్ష్మి, ఐసిడిఎస్‌ పిడి నాగ శైలజా, డిఎల్‌డిఓ రవికుమార్‌, చిత్తూరు కమిషనర్‌ అరుణ, చిత్తూరు, పలమనేరు, కుప్పం, నగరి ఆర్డీఓలు చిన్నయ్య, మనోజ్‌ కుమార్‌రెడ్డి, శ్రీనివాసులు, సుజన, ఐసిఓఎల్‌ డిప్యూటీ కలెక్టర్‌ భవాని, పుంగనూరు, పలమనేరు మున్సిపల్‌ కమిషనర్లు నరసింహ ప్రసాద్‌, కిరణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

➡️