మావి గొంతెమ్మ కోర్కెలు కావు

Dec 25,2023 23:01
మావి గొంతెమ్మ కోర్కెలు కావు

ప్రజాశక్తి – పుంగనూరు, కార్వేటినగరం, యంత్రాంగం ‘మేము గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు.. న్యాయమైన సమస్యలనే, మీరిచ్చిన హామీలనే అమలు చేయాలని కోరుతున్నాం..సిఎం జగన్మోహన్‌రెడ్డి మమ్మల్ని పట్టించుకోకపోవడం బాధాకరం’ అని అంగన్‌వాడీలు వాపోయారు. పుంగనూరు ఐసిడిఎస్‌ కార్యాలయం ఎదుట 14వ రోజు సోమవారం సమ్మెలో పాల్గొన్నారు. అంగన్‌వాడీ నేతలు సునంద, సునీత, శంకరమ్మ, లలిత, ధనలక్ష్మి పాల్గొన్నారు. – కార్వేటినగరం ప్రాజెక్టు పరిధిలో క్రిస్మస్‌ రోజైన సోమవారం మూడు మండలాలకు సంబంధించిన అంగన్వాడీలు కబడ్డీ ఆడి తమ నిరసన వ్యక్తం చేశారు. 14 రోజులు పూర్తి కావస్తున్నా ప్రభుత్వం ఎలాంటి చర్చలకు పిలవకపోవడం దారుణమని సిఐటియు మండల ప్రధాన కార్యదర్శి మమత, ఏఐటియుసి రాధమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన కోర్కెలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. నిరవధిక సమ్మె కార్యక్రమంలో కార్వేటినగరం, వెదురుకుప్పం, శ్రీ రంగరాజపురం మండలాలకు చెందిన కార్యకర్తలు,హెల్పర్లు పాల్గొన్నారు.- యాదమరిలో తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆటపాటలతో సమ్మె కొనసాగించారు. ఏపీ అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) జిల్లా అధ్యక్షురాలు షకీలా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 14 రోజులుగా అంగన్వాడీల సమస్యను పరిష్కారం వైపు ఆలోచించకుండా నిర్బంధముతో సమ్మెను అణచాలని అనుకుంటే సమ్మెను మరింత ఉద్ధతం చేస్తామన్నారు. అన్ని రకాల ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తూ ప్రభుత్వ ప్రతిష్టను పెంచుతున్న అంగన్వాడి ఉద్యమంపై దాడి చేయడం ఏమిటని ప్రశ్నించారు. అంగన్వాడీలకు సుప్రీంకోర్టు ఇచ్చి తీర్పు ప్రకారం కనీస వేతనాలు అమలు చేయాలని, ఐసిడిఎస్‌ లక్ష్యం నెరవేరడానికి ఐసిడిఎస్‌ ను బలోపేతం చేయాలని డిమాండ్‌ చేశారు. యాదమరి మండలం అంగన్వాడీ అధ్యక్షులు మమత, ప్రభావతి లతోపాటు పెద్ద సంఖ్యలో అంగన్వాడీలు పాల్గొన్నారు.- చిత్తూరు అర్బన్‌లో సిఐటియు జిల్లా గౌరవాధ్యక్షులు వాడ గంగరాజు మాట్లాడుతూ పండుగలకు దూరం చేస్తూ పస్తులతో నింపిన ఏకైక ప్రభుత్వం వైఎస్‌ఆర్‌సిపి అని ధ్వజమెత్తారు. క్రిస్మస్‌ రోజు అంగన్‌వాడీలకు జగన్మోహన్‌రెడ్డి కానుక ఇస్తారనుకుంటే, మాటను నిలబెట్టుకునే ధైర్యం లేదన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఎన్ని పండుగలైనా శిబిరంలోనే చేసుకుంటామన్నారు. 26 నుంచి సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మంగళవారం ఖాళీప్లేట్లు గరిటలతో శబ్దం చేస్తూ నిరసన వ్యక్తంచేస్తామని, బుధవారం ప్రజాప్రతినిధులకు సామూహిక వినతిపత్రాలు, 28 నుంచి రిలేదీక్షలు చేపడతామన్నారు. నూతన సంవత్సరంలో మూడో తేదీ కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని, ఇందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సురేంద్రన్‌, నాయకురాలు రమాదేవి, ఏపీ అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు సుజని, బుజ్జి,రాధ తదితరులు పాల్గొన్నారు.

➡️