రైతులు కొబ్బరి సాగుకు సన్నద్దమవ్వండి- ఉద్యాన శాస్త్రవేత్త తిరుపాల్‌ రెడ్డి

Dec 28,2023 22:25
రైతులు కొబ్బరి సాగుకు సన్నద్దమవ్వండి- ఉద్యాన శాస్త్రవేత్త తిరుపాల్‌ రెడ్డి

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: జిల్లాలో కొబ్బరి సాగుకు మంచి వాతావరణం ఉందని గతంలో మాదిరిగా సాగును గణనీయంగా పెంచినట్లయితే ఉపయోగకరంగా ఉంటుందని డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉద్యాన యూనివర్సిటీ సీనియర్‌ శాస్త్రవేత్త తిరుపాల్‌రెడ్డి అన్నారు. కొబ్బరిబోర్డు ఆధ్వర్యంలో కట్టమంచి బాలకష్ణారెడ్డి మ్యాంగో భవన్‌లో గురువారం ఉద్యానవన సిబ్బంది, రైతులతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా శాస్త్రవేత్త మాట్లాడుతూ కొబ్బరి ద్వారా మంచి ఆదాయం పొందే అవకాశం ఉందని ఒకప్పుడు చిత్తూరు జిల్లాలో భారీస్థాయిలో అయ్యేదని ప్రస్తుతం చాలామంది రైతులు ఈ పంట సాగుకు మొగ్గు చూపుతున్నారని మంచి యాజమాన్య పద్ధతులు నాణ్యమైన మొక్కలు ద్వారా తక్కువ కాలంలో పంటలను సాధించే మొక్కల ద్వారా మంచి ఆదాయం పొందే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం జిల్లాలో పొలం గట్ల మీద కొబ్బరి సాగు చేయడం జరుగుతుందని కోస్తా జిల్లాలలో లాగానే చిత్తూరు జిల్లాలో కూడా సాగు చేసే అవకాశం ఉందన్నారు. కొబ్బరిబోర్డు డిప్యూటీ డైరెక్టర్‌ కుమార్‌ వేల్‌ మాట్లాడుతూ ఒకప్పుడు చిత్తూరు జిల్లాలో భారీ ఎత్తున సాగు అయ్యేదని ప్రస్తుతం కొంతమంది మామిడికి ప్రత్యామ్నాయ పంటగా సాగు చేయాలని భావిస్తున్నారని తాజాగా 500హెక్టార్లకు సంబంధించి విస్తరించాలని భావిస్తున్నారన్నారు. రానున్న కాలంలో మరింతగా విస్తరించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలో కొబ్బరిని విస్తరించేందుకు వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ కొబ్బరిబోర్డు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రానున్న కాలంలో ఎగుమతులకు వీలైన నాణ్యత గల కొబ్బరిసాగు విధానాలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లి అవగాహన కలిగించి మంచి ఉత్పత్తులు సాధించేలా చర్యలు తీసుకుంటామన్నారు. పంట విస్తరణ కోసం పలు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఉద్యానవనశాఖ జిల్లా అధికారి మధుసూదన్‌రెడ్డి, శాస్త్రవేత్త శ్రీనివాసులు రెడ్డి, ఏపీఎంఐపి పిడి రమణారెడ్డి, ఉద్యానవన శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

➡️