లోపాలు లేకుండా సరుకులు పంపిణీ : జెసి

Dec 26,2023 21:43

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: పౌరసరఫరాలకు సంబంధించి ఎండియూ ఆపరేటర్ల ద్వారా సరుకులు సరఫరా చేయించాలని, ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులకు సంబంధించి 9వ తేదీ వరకు వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి పూర్తి చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ పి.శ్రీనివాసులు అన్నారు. మంగళవారం క్యాంపు కార్యాలయం నుంచి జాయింట్‌ కలెక్టర్‌ డిఆర్‌ఓ, ఈఆర్వోలు, ఆర్డీవోలు, తహశీల్దారులు, వీఆర్వోలు ఇతర ఎన్నికలకు సంబంధించిన సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ జిల్లాలో అనుభవంలో ఉన్న వివిధ భూములకు సంబంధించి ఫ్రీ హౌల్డ్‌ రైట్స్‌కు అందిన దరఖాస్తులు విఆర్‌ఓ స్థాయిలో ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని వాటిని వెంటనే పరిష్కారం చేయాలని ఆర్డీఓలు ఈ విషయంలో శ్రద్ధ వహించాలన్నారు. పౌరసరఫరాల వ్యవస్థకు సంబంధించి ఎండీయూ ఆపరేటర్ల ద్వారా ఇంకా ఎవరైనా వాలంటరీగా దరఖాస్తు చేసి ఉంటే వారిని తీసుకొని వెంటనే ఈ వ్యవస్థలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. ఎండియూ ఆపరేటర్ల పాయింట్లకు సంబంధించి అప్లోడ్‌ ప్రక్రియ వెంటనే పూర్తిచేయాలనన్నారు. హంద్రీనీవా కాలువకు సంబంధించి భూమిని కోల్పోతున్న వారి కుటుంబాలకు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించుకోవాలని అటువంటి వారిని గుర్తించి కుప్పం పలమనేరు ఆర్డిఓ కార్యాలయాలకు తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని అన్నారు. డిసెంబర్‌ నెల 9 వరకు ఎన్నికల ప్రక్రియలకు సంబంధించి ఓటర్ల మార్పులు చేర్పులు తీసివేతలకు సంబంధించిన ప్రక్రియను పూర్తిస్థాయిలో క్షేత్రస్థాయిలో పరిష్కరించాలన్నారు. అదేవిధంగా ఎన్నికల కమిషన్‌ నుంచి వచ్చిన నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని అన్నారు. పోలింగ్‌ స్టేషన్‌ల వారీగా నెట్వర్క్‌ సంబంధించి, ఎపిక్‌ కార్డులకు సంబంధించి, రూట్‌ ఆఫీసర్లకు సంబంధించి, డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్లకు సంబంధించి, ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన ఉద్యోగుల ప్రక్రియను పూర్తిచేయాలని నియోజకవర్గాల వారీగా నోట్స్‌ తయారు చేయాలని అన్నారు. క్యాంప్‌ కార్యాలయం నుంచి జాయింట్‌ కలెక్టర్‌తో పాటు వీడియో కాన్ఫరెన్స్‌లో డిఎస్‌ఓ శంకరన్‌ పాల్గొన్నారు.

➡️