సర్కార్‌పై పోరుకేక.. సమ్మె ఆగదు దిగొచ్చేదాక.!

Dec 17,2023 23:13
సర్కార్‌పై పోరుకేక.. సమ్మె ఆగదు దిగొచ్చేదాక.!

ప్రభుత్వం దిగిరాకుంటే సమ్మె ఉధృతంప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్‌: అంగన్వాడి వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం గత 12వ తేదీ నుండి నిరవధిక సమ్మె చేపట్టడం విధితమే. 6వ రోజు శనివారం ఉదయం కట్టమంచి చెరువు స్వామి వివేకానంద విగ్రహం వద్ద అంగన్వాడి కార్యకర్తలు మానవాహారం నిర్వహించారు. అంగన్వాడీ యూనియన్‌ నేతలు సృజని, ప్రేమ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్‌ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తన పాదయాత్రలో అధికారంలోకి వస్తే అంగన్వాడీ కార్యకర్తలకు న్యాయమైన సమస్యలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తలకు ఇస్తున్న వేతనం కన్నా రూ.వెయ్యి ఎక్కువగా ఇస్తామని హామీ ఇచ్చి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాలు పూర్తి కావస్తున్న ఎన్నికలు సమీపించే రోజులు దగ్గర పడుతున్న ఇప్పటికీ కార్మికులు సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలం అయ్యారన్నారు. ఎన్నికలు వస్తున్నా సందర్భంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ప్రజలను, రైతులను మోసం చేయడానికి ఎన్నికల జిమ్మిక్కులు చేస్తున్నారని విమర్శించారు.జీతాలు పెంచే వరకూ సమ్మె విరమించబోం.. – యూనియన్‌ రాష్ట్ర కోశాధికారి వాణిశ్రీ పులిచర్ల: న్యాయపరమైన అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె విరమించే ప్రసక్తే లేదని ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర కోశాధికారి వాణిశ్రీ స్పష్టం చేశారు. ఆదివారం 6వ రోజు సమ్మె సందర్భంగా సిఐటియు ఆధ్వర్యంలో పులిచర్ల ప్రాజెక్టు వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి యూనియన్‌ రాష్ట్ర కోశాధికారి వాణిశ్రీ, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి నరసింహారావు, చిత్తూరు జిల్లా యూనియన్‌ గౌరవాధ్యక్షుడు వాడ గంగరాజులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పదే పదే చర్చలు పేరుతో సమస్యలు పరిష్కారం చేయకుండా నానబెడుతున్నదని అనివార్య పరిస్థితిలో సమ్మెకు వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. సమ్మె సందర్భంగా సమస్యలను పరిష్కారం చేసే దిశగా ఆలోచించకుండా దౌర్జన్యానికి దిగుతూ సమ్మెలో ఉంటున్న వారిని బెదిరించడం సరైంది కాదన్నారు. గతంలో అనేక పోరాటాలు సందర్భంగా ప్రభుత్వాలు అరెస్టులు చేయడం కేసులు పెట్టడం లాంటి పద్ధతిలో అణచివేయడం ప్రయత్నం చేశారు తప్ప దౌర్జన్యం చేయలేదని నేటి ప్రభుత్వం భౌతికంగా దాడులకు దిగడం దారుణమన్నారు. ప్రభుత్వం ఇలాగే మొండిగా వ్యవహరిస్తే పోరాటాన్ని ఉధతం చేస్తామని దానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ముఖ్యమైన సమస్యలు వేతనాలు పెంచడం, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాటివిటీ అమలు చేయడం లాంటి వాటిని పరిష్కారం చేయాలని డిమాండ్‌ చేశారు. సమ్మెను భగం చేయాలని చూస్తే అది అంగన్వాడీల విషయంలో సాధ్యం కాదన్నారు. కార్యక్రమంలో అంగన్వాడి సిఐటియు నాయకులు పాల్గొన్నారు.కుమారిగిరిపై హరోహర స్మరణతో నిరసన కార్వేటినగరం: కార్వేటినగరం ఐసిడిఎస్‌ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడి కార్యకర్తలు స్థానిక కుమారగిరిపై శ్రీసుబ్రమణ్యస్వామి ఆలయం వద్ద మోకాళ్లపై హరోహర స్మరణతో నిరసన తెలిపారు. కార్వేటినగరం, వెదురుకుప్పం, శ్రీ రంగరాజపురం మండలాలు సంబంధించిన అంగన్వాడి కార్యకర్తలు వినూత్నంగా నిరసన కార్యక్రమంతో ప్రభుత్వానికి తమ డిమాండ్‌లు తెలిపారు. ”జగనన్న మనస్సు మార్చు.. మా సమస్యలు తీర్చు స్వామీ” అంటూ నినాదాలు చేశారు. సిఐటియు మండల ప్రధాన కార్యదర్శి మమత, రాధమ్మలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి కక్ష సాధింపులు తమకు లేవని న్యాయమైన సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రభుత్వం దిగొచ్చి సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామన్నారు.

➡️