3న కలెక్టరేట్‌ ముట్టడి

Dec 27,2023 22:07

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌
ఎన్నికల ముందు అంగన్వాడీల జీతాలు పెంచుతామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చి ఐదేళ్ళు గడిచిపోయింది.. నేడు జీతాలు పెంచమంటే పెడచెవిన పెడుతున్నారు.. మీరైనా మీ నాయకుడికి చెప్పి న్యాయం చేయాలంటూ సమ్మెలో ఉన్న అంగన్వాడీలు జిల్లాలోని ఎంఎల్‌ఏల నివాసాల వద్ద నిరసన వ్యక్తం చేసి వినతిపత్రాలను అందజేశారు. చిత్తూరు ఎంఎల్‌ఏ ఆరణి శ్రీనివాసులు అంగన్వాడీలోస్తున్నారని ఉదయాన్నే అందుబాటు లేకుండా వెళ్లిపోయారు. దీంతో చిత్తూరు లక్ష్మీనగర్‌ కాలనీలోని ఎంఎల్‌ఏ నివాసం వద్ద బైటాయించిన అంగన్వాడీలు ఎంఎల్‌ఏ సతీమణికి వినతిపత్రం అందించారు. సాయంత్రం ఇంటికి చేరిన ఎంఎల్‌ఏను కలసి మరోమారు అంగన్వాడీలు వినతిపత్రం అందించారు. అలాగే చిత్తూరు- బెంగుళూరు జాతీయ రహదారి సమీపంలోని పూతలపట్టు ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఎంఎల్‌ఏ ఎంఎస్‌ బాబుకు అంగన్వాడీ వర్కర్స్‌ అండర్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి షకిల, నాయకురాలు మమత, 200మందికి పైగా అంగన్వాడీలు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంగన్వాడీల సమస్యలను అడిగి తెలుసుకుని వారికి అండగా ఉంటానని హామీ ఇవ్వడంతో పాటు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళత్తానని తెలిపారు. అలాగే జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అంగన్వాడీలు ప్రజాప్రతినిధుల ఇండ్లు, కార్యాలయాల వద్ద తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలంటూ ఆందోళనలు చేస్తూ వినతిపత్రాలను సమర్పించారు. ప్రజాప్రతినిధుల ఇండ్ల వద్ద నిరసన కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు, సహాయకులు వేలాదిగా పాల్గొన్నారు. చిత్తూరులో సిఐటియు, ఏఐటీయూసీ నాయకులు వాడ గంగరాజు, నాగరాజులు మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం వ్యవహరించిన తీరు దుర్మార్గమన్నారు. చర్చలకు పిలిచి నాయకులను అవమానించడం సరైనది కాదన్నారు. వేతనాలు పెంచే ప్రసక్తే లేదని చెప్పడానికి తీవ్రంగా ఖండించారు. గ్రాట్యుటి విషయంలో కోర్టుకు వెళ్ళండి అని చెప్పడం సిగ్గుచేటు అని, కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయకుండా కోర్టుకు వెళ్ళమని చెప్పడం బాధితరాహిత్యం అన్నారు. చర్చల సందర్భంగా మంత్రులు మీ సమస్యలను ఇలాకా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లలేదని చెప్పడం చూస్తే మోసం అని తెలిపారు. గత 16 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా లక్షమంది మహిళలు రోడ్లమీద అలమటిస్తుంటే సీఎం దష్టికి తీసుకెళ్లలేదని చెప్పడం ఇంకా సమయం కావాలని కోరడం ఏమిటని ప్రశ్నించారు. ఆలస్యం చేసిన సమస్య పరిష్కారం అయ్యేంతవరకు సమ్మెను కొనసాగిస్తామని జనవరి 3న కలెక్టరేట్ల ముట్టడిని భారీఎత్తున నిర్వహిస్తామని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా సానుకూలంగా స్పందించి సమస్యలను పరిష్కారం చేస్తే తప్ప లేని పక్షంలో భవిష్యత్తులో జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు, అంగన్వాడీ సంఘం జిల్లా నాయకులు సుజని, సుభాషిని, బుజ్జి, ప్రభావతి, సిఐటియు నాయకులు బాలసుబ్రమణ్యం, ఏఐటీయూసీ నాయకులు రమాదేవి, గోపీనాథ్‌, మనీ పాల్గొన్నారు. పలమనేరు: తమ సమస్యలు పరిష్కరించి న్యాయం చేయాలని, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ పలమనేరు నియోజకవర్గం ఎమ్మెల్యే ఇంటిని అంగన్వాడీలు ముట్టడించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎమ్మెల్యే కార్యాలయంలోని సిబ్బందికి అందజేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గిరిధర్‌ గుప్తా, ఓబులురాజు, సుబ్రహ్మణ్యం, డివి. మునిరత్నం, శాంతి, ఐఎఫ్‌టియు రాష్ట్ర నాయకులు విఆర్‌.జ్యోతి, ఏఐటియుసి నాయకులు శాంతి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ గత 16 రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోక పోగా చర్చలు పిలిచి అవమానించడం బాధాకరమన్నారు. జనవరి 3వతేదీన కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమంలో అంగన్వాడీలందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వీరితోపాటు ఐద్వా జిల్లా కార్యదర్శి భువనేశ్వరి, కెవిపిఎస్‌ నాయకులు ఈశ్వర్‌, అంగన్వాడీలు పాల్గొన్నారు కుప్పం: అనుకున్నది సాధించేంత వరకు ఆందోళన ఆపేది లేదని అంగన్వాడీ ఉద్యోగులు తేల్చి చెప్పారు. కుప్పం మండల అంగన్వాడీలు పట్టణంలోని ఐసిడిఎస్‌ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి చిత్తూరు జిల్లా ఎమ్మెల్సీ భరత్‌ క్యాంప్‌ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు తమ న్యాయమైన కోరికలు నెరవేర్చాలి అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. అనంతరం తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్సీ వ్యక్తిగత కార్యదర్శికి వినతిపత్రాన్ని అందజేశారు. అక్కడి నుండి ర్యాలీగా బయలుదేరి టిడిపి కార్యాలయానికి చేరుకుని కుప్పం శాసనసభ్యులు నారా చంద్రబాబు నాయుడు తరపున అందుబాటులో ఉన్న స్థానిక టిడిపి నాయకులకు సైతం వినతిపత్రాలను అందజేశారు.

➡️