సోషల్ మీడియాలో రెచ్చగొడితే చర్యలు

Jun 8,2024 14:54 #Chittoor District

– జిల్లా ఎస్పీ విఎన్. మణికంఠ చందోలు, IPS

ప్రజాశక్తి-చిత్తూరు : సమాజంలో శాంతి, సమరసతని కాపాడటం మనందరి బాధ్యతని సోషల్ మీడియా లేదా వాట్సాప్ లలో ఎటువంటి విద్వేషాలు రెచ్చగొట్టే సందేశాలు, ఫోటోలు పోస్ట్ చేస్తే గ్రూప్ అడ్మిన్స్ వారే పూర్తి భాద్యత వహించాలని జిల్లా ఎస్.పి. తెలిపారు. ఎన్నికల ఫలితాల అనంతరం వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాలలో కొందరు రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్నారని సమాచారం అందింది.
ఇలాంటి పోస్టులు వ్యాపింపచేయడం ద్వారా ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారు. గ్రూపులలో ఎవరైనా ప్రజాశాంతికి విఘాతం కలిగించే విధంగా పోస్ట్ చేస్తే వారిపైనే కాకుండా గ్రూప్ అడ్మిన్ లపై కూడా చట్ట పరమైన చర్యలు తీసుకోబడును. వివాదాస్పద విషయాలు లేదా తప్పుదారిపట్టించే సమాచారం పంపినవారిని గ్రూప్ నుండి వెంటనే తొలగించాలి. అసత్య ప్రచారాలు, విద్వేషాలను ప్రోత్సహించే పోస్టులు సృష్టించడం చట్టవిరుద్ధం. రెచ్చగొట్టే పోస్టులు, ఫోటోలు, వీడియోలను షేర్ చేయడం లేదా స్టేటస్‌లుగా పెట్టడం నిషిద్ధం. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి అని సూచించారు. రాజకీయ విగ్రహాలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇలాంటి చర్యలు సామాజిక శాంతి భద్రతలకు ప్రమాదకరం కావున, వీటిని పూర్తిగా అరికట్టడమే లక్ష్యం. ఆస్తులు ధ్వంసం చేయడం ద్వారా సామాజిక కల్లోలాలు సృష్టించబడతాయి. ప్రజల్లో భయం, ఆందోళన, అసురక్షిత భావాలను పెంచుతుంది. ఇలాంటి చర్యలు సమాజంలో సంఘీభావాన్ని దెబ్బతీస్తాయి అని ఎస్పీ అన్నారు. ప్రభుత్వ ఆస్తులు ప్రజల సొత్తు కాబట్టి వాటిని రక్షించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉంది.
ప్రైవేట్ ఆస్తులు వ్యక్తిగత సంపద, కష్టార్జితం. వాటిని ధ్వంసం చేయడం వారి ఆర్థిక స్థితిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఆస్తులు ధ్వంసం చేయడం ద్వారా వ్యక్తిగత హక్కులను ఉల్లంఘించడం అవుతుందని అన్నారు. ఆస్తులు ధ్వంసం చేయడం వంటి చర్యలు సమాజంలో విభేదాలు, విభజనలకు కారణమవుతాయి అని హెచ్చరించారు. సామాజిక సామరస్యాన్ని కాపాడుకోవడానికి ఇలాంటి చర్యలను తక్షణమే అరికట్టడం అవసరం. రాజకీయ విగ్రహాలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని ఇలాంటి నేరగాళ్లను గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడవచ్చు. ప్రజలు సామాజిక శాంతి భద్రతలను కాపాడుకోవడానికి సహకరించాలని, ఇలాంటి నేరచర్యలను అరికట్టాలని ప్రజలను ఎస్పీ కోరారు.

➡️