ఊతలపట్టులో గంజాయి జోరు!పెడదోవ పడుతున్న యువత చోద్యం చూస్తున్న పోలీసు అధికారులు అంధకారంలో బతుకులు

ఊతలపట్టులో గంజాయి జోరు!పెడదోవ పడుతున్న యువత చోద్యం చూస్తున్న పోలీసు అధికారులు అంధకారంలో బతుకులు

ఊతలపట్టులో గంజాయి జోరు!పెడదోవ పడుతున్న యువత చోద్యం చూస్తున్న పోలీసు అధికారులు అంధకారంలో బతుకులు దేశానికి వెన్నెముకలా నిలవాల్సిన యువత.. తల్లిదండ్రుల ఆశయ సాధనకు అడుగులు వేయాల్సిన పుత్రులు.. వందేళ్ల జీవితాన్ని సాగించాల్సిన సాధకులు గంజాయి మత్తులో పడి పెడదోవ పడుతున్నారు. గంజాయి మత్తులో చేయరాని పనులు చేస్తూ తల్లిదండ్రులను శోకసంద్రంలోకి నెడుతున్నారు. విద్యను పక్కనపెట్టి చెట్ల కింద, పుట్ల కింద కాలాన్ని వెళ్లదీస్తున్నారు. పక్కదారి పడుతున్న యువతపై నిఘా వేసి సన్మార్గంలో నడపాల్సిన పోలీసు అధికారులు చోద్యం చూస్తుండడంతో యువత బతుకులు అంధకారంలోకి వెళుతున్నాయి. ప్రజాశక్తి- పూతలపట్టు: చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలో ఎక్కడా లేని విధంగా గంజాయి అమ్మకాలు కొనసాగుతున్నాయి. యథేచ్ఛగా రోడ్లపై గంజాయిని అమ్ముతున్నా పట్టించుకునే నాథుడే లేడు. దీంతో యువకులు అడ్డు అదుపు లేకుండా గంజాయికి బానిసలు అవుతున్నారు. గ్రామాల్లోని కొందరు ‘పెద్దలు ఇదేమిటి?’ అని నిలదీస్తే ‘పోలీసులే పట్టించుకోవడం లేదు మీకేమిటి?’ అని ఎదురు తిరుగుతున్నారు. దీంతో ఈ దుస్థితిని చూస్తూ ఉండడమే తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితి నెలకొంది. క్రికెట్‌ పేరుతో కొందరు గుంపులు గుంపులుగా వెళ్లడం, గంజాయి మత్తులో తూలి తూగుతున్నారు.మతిస్థిమితం కోల్పోతున్న యువత గంజాయికి బానిసలైన యువకులు మతిస్థిమితం కోల్పోయి రోడ్డు పాలవుతున్నారు. పూతలపట్టు మండల కేంద్రంలో ఇప్పటికే ముగ్గురు వరకు గంజాయి మత్తుకు బానిసలై మతి స్థిమితం కోల్పోయారు. మరి కొందరు మత్తులో నిత్యం గొడవలు చేస్తూ తల్లిదండ్రులకు నిద్రలేకుండా చేస్తున్నారు. గంజాయికి అవసరమైన డబ్బుల కోసం గహాల్లోని విలువైన వస్తువులను అమ్ముతున్నారు. ఇటీవల గంజాయికి ఉపయోగపడుతుందని బానిసయిన వ్యక్తి ఏకంగా ట్రాక్టర్‌ నే చోరీ చేశాడు. పోలీసులకు పట్టుబడి కటకటాల పాలయ్యాడు. మంగళవారం గంగ జాతరలో ఒక యువకుడు గంజాయి సేవించి మత్తులో కనిపించిన వారిని చితక బాదాడు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది. అడ్డాగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల గంజాయి విక్రయానికి అడ్డాగా మారింది. మైదానంలో క్రికెట్‌ పేరుతో గుమి కూడడం.. చీకటి పడగానే మద్యం, గంజాయి సేవిస్తున్నారు. ఇక పాఠశాలల సెలవుల్లో అయితే గంజాయి బాధితులు మొత్తం ఉదయం నుంచి రాత్రి వరకు మైదానంలోనే గడుపుతున్నారు.చోద్యం చూస్తున్న పోలీసు అధికారులు మండల కేంద్రంలో గంజాయి మత్తులో పడిన యువకుల నుంచి అనేక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. చోరీలు జరుగుతున్నా యథేచ్ఛగా రోడ్లపైనే గంజాయి అమ్మకాలు సాగుతున్నా పోలీసు అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారే తప్ప ఇందుకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. యువత పక్కదారి పడుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడంతో యువకుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

➡️