నూతన రవాణా చట్టాన్ని రద్దు చేయాలి: సీఐటీయూ

ప్రజాశక్తి-సంతనూతలపాడు: దుర్మార్గమైన నూతన రవాణా చట్టాన్ని రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు డిమాండ్‌ చేశారు. సంతనూతలపాడు మండల ఆటో వర్కర్స్‌ యూనియన్‌ జనరల్‌ బాడీ సమావేశం స్థానిక సుందరయ్య భవనంలో ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు కాలం సుబ్బారావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నూతన రవాణా చట్టాన్ని తీసుకొచ్చి ప్రమాదాలకు డ్రైవర్లని బాధ్యులుగా చేస్తూ వాళ్ల లైసెన్సులు, జైలు శిక్ష విధించేటువంటి దుర్మార్గమైన చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ట్రాన్స్‌పోర్ట్‌ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టే చర్యలను వెనక్కి తీసుకోవాలని కోరారు. పెట్రోలు, డీజిల్‌ ధరలు విపరీతంగా పెరగడం మూలంగా ఆటో కార్మికుల జీవనం కష్టంగా ఉందని అన్నారు. నిత్యావసర సరుకులు ధరలు పెట్రోల్‌ డీజిల్‌ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శి బంకా సుబ్బారావు పాల్గొన్నారు. అనంతరం ఆటో వర్కర్స్‌ యూనియన్‌ మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా కె ప్రసాదు, ప్రధాన కార్యదర్శిగా పి శ్రీను, ఉపాధ్యక్షులుగా పి మసయ్య, సహాయ కార్యదర్శిగా ఎస్‌డి షరీఫ్‌, కోశాధికారిగా యు రాఘవ, మరో ఆరుగురితో నూతన కమిటీని ఎన్నుకున్నారు.

➡️